వాలీబాల్ పోటీలు విజయవంతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను విజయవంతం చేయాలని ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) కార్యదర్శులను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు బుధవారం కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి నవంబర్ 1,2 తేదీల్లో పలమనేరు డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే 69వ రాష్ట్రస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పోటీల నిర్వహణలో క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్ డీఐఈఓ సమన్వయంతో పోటీలు విజయవంతం చేయాలన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 పోటీల కార్యదర్శి బాబు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నుంచి 13 బాలల, 13 బాలికల జట్లు కళాశాల నుంచి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పలమనేరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ సిరాజ్, 14,17 ఎస్‌జీఎఫ్ అడ్మిన్ కార్యదర్శి శారద, ఖోఖో సంఘం కార్యదర్శి శరత్ తదితరులు పాల్గొన్నారు.


