కలానికి సంకెళ్లు! | - | Sakshi
Sakshi News home page

కలానికి సంకెళ్లు!

Oct 16 2025 5:41 AM | Updated on Oct 16 2025 5:41 AM

కలాని

కలానికి సంకెళ్లు!

● ప్రశ్నిస్తే కేసులు.. వేధింపులు ● జిల్లాలోని పాత్రికేయులపై అక్రమ కేసులు ● కూటమి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ● ప్రభుత్వ తీరుపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం

నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ..

కూటమి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ..

చిత్తూరు అర్బన్‌ : ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను పాత్రికేయులు ఎత్తిచూపితే అధికారులు, పాలకులు పొరపాట్లను సరిచేసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నించే పత్రికలపై కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కుకు సంకెళ్లు వేస్తున్నారు. మద్యంపై వార్తలు రాస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికపై కక్షగట్టి కేసులు పెడుతున్నారు.

జిల్లాలో కేసులు ఇలా..

పత్రికలో ఏదైనా కథనం ప్రచురితమైతే అందులో ఉన్న విషయాన్ని గుర్తించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. తప్పుచేసిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోచ్చు. కథనంలో ఏదైనా తప్పుగా ఉందనిపిస్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు. న్యాయపరంగా ముందుకు వెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి వార్తలు రాసిన పాత్రికేయులే లక్ష్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.

● కుప్పం రూరల్‌ మండలంలో ఒకరు చనిపోతే శ్మశాన వాటికలో ఓ వర్గం అనుమతించలేదని, స్థానికంగా పోలీసులు కల్పించుకోవడంలో పరిస్థితి సద్దుమణిగిందంటూ సాక్షితో పాటు ఇతర పత్రికల్లోనూ వార్తలు ప్రచురితమయ్యాయి. కానీ స్థానిక సాక్షి విలేకరి నాగరాజుపై స్థానిక కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది జూన్‌లో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.

● కుప్పంలో హంద్రీ–నీవా కాలువ గేట్లలోకి పాము వచ్చిందని, గేటు మరమ్మతు చేసే సమయంలో నీళ్లు ఆగాయంటూ ‘సాక్షి’లో వార్త ప్రచురితమయ్యింది. దీన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గతనెల ‘సాక్షి’ రిపోర్టర్లపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.

● పుంగనూరులో ఓ మైనర్‌ బాలిక కనిపించలేదని పోలీసులు మీడియాకు చెప్పడంతో గతేడాది వార్త ప్రచురించారు. అయితే బాలిక హత్యాచారానికి గురయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలి, నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలు రాసినందుకు సాక్షి ఎడిటర్‌తో పాటు స్థానిక విలేకరి ప్రకాష్‌పై కేసు పెట్టారు.

● తిరుమలలో కల్తీనెయ్యి వ్యవహారంపై పాలకులు ఆరోపణలు చేయడం, దీనిపై సుప్రీం కోర్టు కల్పించుకుని విచారణకు ఆదేశించడం తెలిసిందే. తిరుమలలో జరిగి వాస్తవాలు బయటపెట్టినందుకు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఒకరి ఫ్లెక్సీ మరొకరు తొలగిస్తుండగా తొట్టంబేడు ‘సాక్షి’ రిపోర్టర్‌ హరీష్‌రెడ్డి వీడియో తీశారు. దీనిపై వార్త రాసినందుకు ఏప్రిల్‌లో అతని పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితి..

మొలకచెరువులో కల్తీ మద్యం తయారుచేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇది సరఫరా కావడంపై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌కు నోటీసులు ఇవ్వాలని బుధవారం ఏకంగా హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నల పేరిట ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్‌ మస్తాన్‌రెడ్డికు సైతం నోటీసులు ఇచ్చి, విచారణ పేరిట స్టేషన్‌కు పిలిపించారు.

ఆక్షేపణీయం

జర్నలిస్టులను ఏ ప్రభుత్వమైనా జర్నలిస్టులుగానే చూడాలి. యాజమాన్యాలతో ముడిపెట్టొద్దు. వాస్తవాలను రాసిందుకు కేసులు పెడుతూ పోవడం మంచి పద్ధతికాదు. ఇది ప్రతికా స్వేచ్ఛను హరించడమే. ఆది ఆక్షేపణీయం.

– మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి,

ఏపీయూడబ్ల్యూజే

భావ వ్యక్తీకరణపై దాడి..

రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కుతో పాటు భావ వ్యక్తీకరణ వ్యక్త పరిచే హక్కును కల్పించింది. ప్రభుత్వాల్లో జరిగే తప్పులకు పత్రికలు ఎత్తి చూపిస్తాయి. ఇందులో తప్పేం ఉంది. ఆ మాత్రం దానికి పత్రికా కార్యాలయాల్లో సోదాలు చేయడం, పాత్రికేయులపై కేసులు పెట్టడం సరైంది కాదు.

– కెఎం.అశోక్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే

పోరాటలే శరణ్యం

పత్రికలు, పాత్రికేయులపై కేసులు పెట్టి నోళ్లు మూయిస్తామనుకునే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. జిల్లాలో పలువురు పాత్రికేయులపై కేసులు పెట్టారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఆందోళనలు చేస్తున్నాం. మున్ముందు ఇలాంటివి కొనసాగితే రోడ్డెక్కి పోరాటాలు చేయక తప్పదు.

– కాలేశ్వరరెడ్డి,

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే

కలానికి సంకెళ్లు! 1
1/4

కలానికి సంకెళ్లు!

కలానికి సంకెళ్లు! 2
2/4

కలానికి సంకెళ్లు!

కలానికి సంకెళ్లు! 3
3/4

కలానికి సంకెళ్లు!

కలానికి సంకెళ్లు! 4
4/4

కలానికి సంకెళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement