
‘బ్లాక్‌రైస్’ బంగారమే!
మాపిళ్లైసాంబ పేరిట పురాతన వరి రకం సాగు పంట నల్లగా.. బియ్యం ఎరుపు రంగు పలమనేరు డివిజన్‌లో 30 ఎకరాల్లో సాగు ఆన్‌లైన్ మార్కెట్‌లో కిలో రూ.200 పైమాటే
పలమనేరు : సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం నాలుగు నెలలు మాత్రమే. అద్భుతమైన ఔషధ గుణాలున్న బ్లాక్ రైస్ రకం ఇప్పుడు రైతులకు వరంగా మారింది. గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలో అక్కడి పూర్వీకులు సహజ పద్ధతిలో సాగు చేస్తూ వరి విత్తనాలను కాపాడుకుంటూ వచ్చారు. అవే నేటి తరాలకు అందుబాటులోకి వస్తున్నాయి. తమిళనాడు ప్రాంతం నుంచి మాపిళ్ళైసాంబ( బ్లాక్‌రైస్) విత్తనాలను తెచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ప్రకృతి రైతు చందూల్ కుమార్ ప్రయోగాత్మకంగా ఈ వంగడాన్ని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు.
ఊపందుకున్న సాగు
పలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామం వద్ద చందూల్ కుమార్ అనే ప్రకృతి రైతు మూడేళ్లుగా బ్లాక్ రైస్‌ను సాగు చేస్తున్నాడు. ఈ విడత సైతం తన ఎకరా పొలంలో ఈ వంగడాన్ని నాటాడు. ప్రస్తుతం వరి పంట ఆరు అడుగులకు పైగా పెరిగి ఏపుగా ఎన్ను పట్టింది. రైతు పూర్తిగా సేంద్రియ, సహజ పద్ధతిలో పంట సాగు చేశాడు. సాధారణంగా వరి పంట కాలం నాలుగు నెలలుగా ఉంటే దీనికి ఏడు నెలలుగా ఉంటుంది. ఈ రైతు పండించిన ఈ రకాన్ని చుట్టు పక్కల ప్రాంతాలే కాదు కర్ణాటక నుంచి సైతం రైతులు సందర్శించి వెళుతున్నారు. ఈ విడత పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో 30 ఎకరాల్లో బ్లాక్‌రైస్ సాగు అవుతోంది.
దేశవాళి వరి వంగడాల్లో అగ్రస్థానం
హరితవిప్లవం తర్వాత పలు రకాల హైబ్రిడ్ వరి వంగడాలు సృష్టించబడి రెండు వేల దాకా వంగడాలు సాగులో ఉన్నాయి. అనాదిగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దేశవాళి రకాలు వంశపారం పర్యంగా సాగులో ఉంటూ ఆ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి 26 కాగా వీటిలో అత్యంత పోషకాలు కలిగిన ఔషధ గుణాలున్న వరుసలో తొలిస్థానం మాత్రం బ్లాక్‌రైస్‌దే, అందుకే మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
కిలో ధర రూ.200 పైమాటే...
దుకాణాల్లో బ్లాక్ రైస్ పెద్దగా అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి పలు కంపెనీలు కిలో నుంచి మూడు, ఐదు కిలోల బ్యాగుల్లో వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. డీమార్ట్, బిగ్‌బాస్కెట్ లాంటి మాల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. కిలో రూ.160 నుంచి రూ.250 దాకా కంపెనీలను బట్టి ధరలున్నాయి.