
రైతులకు అన్యాయం
బంగారుపాళెం : మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ వారి కడుపు కొడుతోందని మామిడి రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బ్రహ్మానందాశ్రమం ఆవరణలో జిల్లా అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షతన మామిడి రైతు ఆక్రందన సభ నిర్వహించారు. గుజ్జు యజమానుల నుంచి అందాల్సిన రూ 370 కోట్లు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగించాల్సిందేనన్నారు.
ఏపంటకూ గిట్టుబాటు లేదు.
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర అందడంలేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రికి చిత్తశుద్థి ఉంటే గుజ్జుయజమానులను కట్టడి చేయడం పెద్ద పనికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు గుజ్జు ఫ్యాక్టరీ యజమానులకే అండగా ఉంటోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. రైతు ఉద్యమాలకు రాజకీయం చేయడం స్థానిక ఎమ్మెల్యేకు తగదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు మాట్లాడుతూ.., పల్ఫ్‌ను టీటీడీ, ఇతర సంస్థలకు సరఫరా చేస్తే గిట్టుబాటు ధర కల్పించడం సాధ్యమన్నారు.
సభను అడ్డుకునేందుకు కుట్రలు
మామిడి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్, మునీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆక్రందన సభ అడ్డుకునేందుకు వారం రోజులుగా స్థానిక శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. నియోజకవర్గంలో రూ. 4 చొప్పున 75 కోట్లు మంజూరు అయినందుకు అభిషేకాలు చేయడం గొప్పకాదని, 8 రూపాయలు చొప్పున రూ 150 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత, మురళీ, ఏఎస్‌ఎప్ జాతీయ నేత శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేంద్ర, కోశాధికారి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు మునిరత్నంనాయుడు, ఉమాపతి నాయుడు, కార్యదర్శులు శ్రీనివాసులు, మోహన్‌రెడ్డి,సందీప్‌రెడ్డి, ఓబుల్‌రాజు, తవణంపల్లె మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ నేత రవికుమార్, చెంగల్‌రాయరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.