
ఎర్రచందనం దుంగల కారు బోల్తా
ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనబోయి బోల్తాపడిన కారు తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహనదారుడు 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారైన స్మగ్లర్లు
బంగారుపాళెం: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కారు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలంలోని కాటప్పగారిపల్లె వద్ద బోల్తాకొటింది. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారున్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు(కేఏ05–ఎండి4456) కాటప్పగారిపల్లె సమీపంలోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారిపై ఎడమ వైపు నుంచి డివైడర్‌ను ఢీకొని కుడివైపునకు దూసుకుపోయింది. కల్లూరుపల్లె పంచాయతీ, కొరివారిపల్లె నుంచి బంగారుపాళ్యానికి వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని రహదారి పక్కన గల కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొరివారిపల్లెకు చెందిన వెంకటస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. బంగారుపాళెం ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ద్విచక్రవాహన దారున్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం దుంగలను కారులో అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు అప్పటికే పారిపోయారు. బోల్తాపడిన కారులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. పారిపోయిన స్మగ్లర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారుతో సహా ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటస్వామిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎర్రచందనం దుంగలు ఎక్కడికి తీసుకువెళ్తునారో?
గతంలో తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి బెంగళూరుకు ఎర్రచందనం అక్రమ రవాణా సాగేది. ఈ క్రమంలో బంగారుపాళెం స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ కేసులు నమోదయ్యాయి. కొన్ని సందర్భాలాలో ఇలా అక్రమంగా దుంగలు తరలిస్తూ కార్లు, టెంపోలు బోల్తాపడిన సంఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు బెంగళూరు నుంచి చైన్నె వైపు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా పోలీసులకు సైతం పలు అనుమానాలకు తావిస్తోంది. బెంగళూరు నుంచే వస్తున్నాయా? లేక జిల్లాలో ఎక్కడైనా డంప్ చేసి వాటిని తరలిస్తున్నారా..? అనే అనుమానం కలుగుతోంది.

ఎర్రచందనం దుంగల కారు బోల్తా