
అదృశ్యమైన మహిళ .. హత్య
విచారణలో వెలుగు చూసిన హత్యోదంతం
పెనుమూరు (కార్వేటినగరం) : అదృశ్యమైన మహిళ అస్థి పంజరంగా ప్రత్యక్షమైన సంఘటన మండలంలోని సామిరెడ్డిపల్లి సమీపంలో బుధవారం వెలుగు చూసింది. చిత్తూరు రూరల్ ఈస్ట్ సీఐ నిత్యబాబు కథనం మేరకు వివరాలిలా.. బంగారు పాళ్యం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన గోవిందు భార్య బుజ్జమ్మ 2023 సంవత్సరం డిసెంబర్‌లో తమ కుమార్తె ఈ.చెంచులక్ష్మి(28) అదృశ్యమైయిందని బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో తేలిన మేరకు బంగారు పాళ్యం మండలానికి చెందిన చెంచులక్ష్మి, ప్రియుడు దేవేంద్రతో కలిసి పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుదాకర్‌రెడ్డి మామిడి తోటలో కాపలా ఉంటూ వచ్చారు. అయితే 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో ఓ రోజు వారి ఇరువురి మధ్య డబ్బుల కోసం గొడవ రావడంతో దేవేంద్ర తాగిన మత్తులో చెంచులక్ష్మిని మామిడి తోటకు సమీపంలో ఉన్న కుంటలోని నీటిలో ముంచి హత్య చేశాడు. చెంచులక్ష్మి తల్లి బుజ్జమ్మ తన కుమార్తె కనిపించడం లేదని బంగారు పాళ్యం పోలీసే స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మహిళ అదృశ్యం కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె అదృశ్యమైనది పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో 2024 జనవరిలో ఆ కేసును పెనుమూరు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. తన కుమార్తె అదృశ్యం వెనుక దేవేంద్ర హస్తం ఉందని చెంచులక్ష్మి తల్లి బుజ్జమ్మ అనుమానించడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. దీంతో నిందితుడు దేవేంద్ర డబ్బులు విషయంలో గొడవలు రావడంతో చెంచులక్ష్మిని తాగిన మత్తులో మామిడి తోట పక్కనే ఉన్న కుంటలో ముంచి చంపేసినట్లు అంగీకరించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వెంకట నరసింహులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చెంచులక్ష్మిని నీటిలో ముంచి హత్య చేసి పూడ్చిన ప్రాంతంలో అస్థి పంజరాన్ని వెలికి తీసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చిత్తూరు రూరల్ ఈస్ట్ సీఐ నిత్యబాబు తెలిపారు.

అదృశ్యమైన మహిళ .. హత్య