వైఎస్సార్‌సీపీ హయాంలో బలోపేతం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో బలోపేతం

Sep 18 2025 7:14 AM | Updated on Sep 18 2025 7:14 AM

వైఎస్సార్‌సీపీ హయాంలో బలోపేతం

వైఎస్సార్‌సీపీ హయాంలో బలోపేతం

రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు పలు ఆస్పత్రుల్లో నిలిచిపోయిన ఓపీ సేవలు సర్వర్‌ సమస్య అంటూ దాటవేస్తున్న వైనం బకాయిల చెల్లింపుపై ముఖం చాటేసిన ప్రభుత్వం ఆందోళన చెందుతున్న పేదలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : కూటమి పాలనలో ఆర్యోగ సేవలు ఆమడదూరంలో నిలిచాయి. ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీకి బకాయిల బెడద పట్టుకుంది. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభావం చూపుతోంది. సేవలు దారి తప్పుతున్నాయి. పలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సర్వర్‌ను బూచిగా చూపుతూ సేవలను నిలిపివేస్తున్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారిందని కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. పేదల ఇంట ఆరోగ్య దీపం వెలిగించే పథకం అంధకారం దిశగా అడుగులు వేస్తోంది.

మోయలేని భారం

ఎన్టీఆర్‌ వైద్య సేవా పరిధిలో జిల్లా వ్యాప్తంగా పలు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. అందులో ప్రైవేట్‌ కార్పొరేట్‌ (నెట్‌వర్క్‌) ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రులు వంద పడకలు, 50 పడకలు గల ఆసుపత్రులు ఉన్నాయి. ఒక రోజుకు వేల మంది నిరుపేద రోగులు ఉచిత వైద్యం కోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వస్తుంటారు. వారికి వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల యాజమాన్యానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక నెలకే ఒక ఆసుపత్రికి రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలను సక్రమంగా చెల్లించలేదు. విడుదల చేసిన నిధుల కన్నా.. ఆసుపత్రుల్లో అందించిన వైద్య సేవలు, అందాల్సిన బిల్లులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఆసుపత్రుల్లో ’వైద్య ’ సేవా’ పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ డెలివరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ డెలివరీలతో పాటు సర్జరీలు, అలాగే గర్భాశయం తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఇందుకు గాను ఒక్కో వ్యాధిని బట్టి వైద్య సేవా ట్రస్ట్‌ నుంచి బిల్లులు మంజూరవుతాయి. ఆ విధంగా వచ్చిన డబ్బును ప్రోత్సాహకం కింద వైద్యులకు 45 శాతం, ఆసుపత్రుల అభివృద్ధికి 55 శాతం కేటాయిస్తారు. అయితే అధిక సంఖ్యలో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారానే దాదాపుగా 35 రకాలకు పైగా వ్యాధులకు ఉచిత వైద్య సేవలు లభించడంతో ఈ ఆసుపత్రులపైనే భారం పడనుంది.

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్టీఆర్‌ వైద్య సేవా పథకం కుంటుపడుతోంది. బిల్లులు చెల్లింపులు జాప్యం చేస్తోంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సేవలపై ముఖం చాటేస్తున్నాయి. జిల్లాలో పలు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలను మంగళవారం నుంచి నిలిపేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి ఆరోగ్యశ్రీకి నోటీసులు ఇచ్చి సేవలకు స్వస్తి పలికాయి. బకాయిల భారంతో ఓపీ సేవలు చూడలేమని చేతులెత్తేసింది. అలాగే మరో ఆస్పత్రి సర్వర్‌ను సాకుగా చూపిస్తూ సేవలను నిలిపివేసింది. మరికొన్ని ఆస్పత్రులు మొక్కుబడిగా సేవలు అందిస్తోంది. ఇంకొన్ని ఆస్పత్రులు ఓపీ వదలి కేవలం అత్యవసర కేసులను మాత్రం తీసుకుంటున్నాయి. చాలా వరకు సీఎం సొంత జిల్లా కావడంతో ఇబ్బందులుంటాయని సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ కారణంగా ఉచిత వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన పేదలు రూ.300 పైగా డాక్టరుకు ఫీజు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా అయితే ఉచిత వైద్యం అందించే వారికి ఓపీ సేవలు ఉచితంతోనే ప్రారంభం అవుతాయి. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు గత్యంతరం లేక ఓపీ సేవలు నిలుపుదల చేశారు. ఈ నిర్ణయం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడంలేదు.

2007–2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా లక్షలాది మంది ఉచిత వైద్యం ద్వారా పునర్జన్మ పొందారు. అనంతరం వైఎస్సార్‌ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. 1000 లోపు ఉన్న వ్యాధుల సంఖ్యను 3,255కు చేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ’ఆరోగ్య శ్రీ’ పథకం ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలంలోనే 4వసారి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్య సేవలను నిలుపుదల చేశాయి. దీంతో ఎన్టీఆర్‌ వైద్య సేవ’ వెంటిలేటర్‌పై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా బకాయిల భారంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఆసోసియేషన్‌ ఓపీ సేవలను నిలుపుదలకు పిలుపుచ్చింది. ఈ పిలుపు మేరకు జిల్లాలో పలు ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement