
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గిరిజన గృహ స్థలాల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించే గిరిజన గృహ స్థలాల సర్వేకు పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను అర్హులైన గిరిజనులకు చేరువ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన స్థలాల్లో గృహ సర్వే మొదటి విడతలో 10 మండలాల్లో నిర్వహించినట్లు తెలిపారు. రెండవ విడత సర్వేలో పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీ, ఉపాధి నిధుల నుంచి గిరిజన కాలనీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.