
అధికారమే అండగా ఆక్రమణ
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ‘‘ఇది మా ప్రభుత్వం.. ప్రతి ఒక్కరూ మా కింద ఉండాల్సిందే.. తహసీల్దార్ నుంచి వీఆర్‌ఓ వరకు మాకు సలాం కొట్టాల్సిందే’’ అంటూ పచ్చమూక రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతోంది. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు తెగబడుతోంది. ఈ క్రమంలో పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి గ్రామంలో దారిని ఆక్రమించుకుంది. పది మంది రైతులకు పొలానికి వెళ్లేందుకు బాట లేకుండా చేసింది. వివరాలు.. దేవదొడ్డి గ్రామంలో మంగమ్మ పేరిట సర్వేనంబర్ 46/2ఏలో 4.03 ఎకరాల భూమి ఉంది. ఆమె కుటుంబీకులు పశువులు మేపుకుంటూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పొలానికి సమీపంలో టీడీపీ స్థానిక నేతలు ధనుంజయ, వెంకటేశులు కొంత భూమి కొనుగోలు చేశారు. తర్వాత మంగమ్మ పొలానికి వెళ్లే కాలిబాటను ఆక్రమించుకునేందుకు యత్నించారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందారు. ఈ ఉత్తర్వులను తహసీల్దార్‌కు అందజేశారు. అయితే సదరు తహసీల్దార్ ఈ విషయంలో తాము చేసేది ఏమీ లేదని చేతులెత్తేశారు. దీంతో పచ్చమూక మరింత రెచ్చిపోయింది, నేతలతోపాటు అధికారులకు సైతం ముడుపులు చెల్లించామని, తమను ఎవరూ ఏం చేయలేరని చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే జేసీబీతో దారిని ఆక్రమించుకుంది. దీంతో బాధితులు వెంటనే కలెక్టర్, ఎస్పీ, ఆర్‌డీఓ భవానీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని కన్నీరుమున్నీరవుతున్నారు.