
సాంకేతికతపై ఆసక్తి చూపించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతికతపై ఆసక్తి చూపించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. బుధవారం నగర సరిహద్దులో ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ స్పేస్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి వైజ్ఞనిక ప్రపంచంలో విద్యార్థులు జ్ఞన సముపార్జనకు ఆసక్తి చూపించాలన్నారు. భారత ప్రభుత్వం 2023వ సంవత్సరంలో చంద్రయాన్–3ని విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా నేషనల్ స్పేస్ డే కార్యక్రమం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. రెండు రోజులు నిర్వహించుకునే ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక కొత్త విషయాలను తెలుసుకోవాలన్నారు. ప్రపంచం సాంకేతికమయం అయిందన్నారు. ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే తరగతి గదులలో విద్యతో పాటు అదనంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. విద్యార్థులు 9 వ తరగతి నుంచే అదనపు జ్ఞానంపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. నేషనల్ అటామిక్ రీసెర్చ్ లాబోరేటరీ సహకారంతో విద్యార్థులకు త్వరలో 50 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతరిక్ష పరిశోధనలపై తెలియని అంశాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. శార్ జీఎం కృతివాసన్ మాట్లాడుతూ.. ఇటీవల జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 ప్రయోగం విజయవంతం అయినట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో చంద్రయాన్–4 ప్రయోగంకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.