
ఇక ‘స్మార్ట్’ బాదుడు !
● ఇప్పటికే కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్ మీటర్లు ● త్వరలో గృహాలు, ఆపై వ్యవసాయ మోటార్లకు బిగింపు ● రీచార్జి చేసుకుంటేనే కరెంట్.. లేదంటే కట్! ● స్మార్ట్ మీటర్లపై నాలుక మడతేసిన బాబు
ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్ వినియోగ సమాచారం
జిల్లాలో మొత్తం ఇంటి సర్వీసులు 3,81,690
వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్లు 1.25 లక్షలు
కుటీర పరిశ్రమల సర్వీసులు మొత్తం 4736
వాణిజ్య సర్వీసులు మొత్తం 4163
జిల్లాలోని జగనన్న లేఅవుట్లు 592
పలమనేరు : ఎన్నికల్లో తానిచ్చే మాట మీద నిలబడే నైజం తనది కాదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని రైతాంగం మండిపడుతోంది. స్మార్ట్ మీటర్లు వద్దంటూ వైఎస్సార్ సీపీ పాలనలో రాద్దాంతం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తనదైన స్టయిల్లో అన్ని వర్గాల ప్రజలకు బాదుడే బాదుడు మొదలెట్టారు. ఎన్నికల ముందు బాదుడే బాదుడు కార్యక్రమం పేరిట కుప్పం పర్యటనకు, ఆ తర్వాత పలమనేరుకు వచ్చిన ఆయన స్మార్ట్ మీటర్లతో రైతులకు ఉరితాడు తప్పదని, వైఎస్సార్‌సీపీ సర్కార్ జనాన్ని ముంచేస్తోందని స్మార్ట్ మీటర్లను అమర్చితే పగులగొట్టాలని జనాన్ని రెచ్చగొట్టారు. తాము అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి ప్లేటు ఫిరాయించారు. స్మార్ట్ మీటర్లను అమర్చుతోంది. మాట తప్పిన చంద్రబాబు, లోకేష్‌పై సామాన్య జనం మండిపడుతున్నారు.
ఇప్పుడు రైతులకు ఉరి కాదా?
అధికారంలోకి వచ్చే సరికి స్మార్ట్ మీటర్లతో ఎన్నో లాభాలుంటాయంటూ నాలుక మడతేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు కేటగిరి–1 గృహాలకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారు. త్వరలో రైతుల మోటార్లకు కూడా అమర్చడం ఖాయంగా కనిపిస్తోంది.
ముందుగా రీచార్జి చేసుకోవాలి
స్మార్ట్ మీటర్లను ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి దాకా ఉన్న పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారు. ఇప్పటి వరకు మీటరు రీడింగ్ చూసి కరెంట్ బిల్లు ఇచ్చేవారు. ఇకపై ఎవరితోనూ పని ఉండదు. స్మార్ట్ ఫోనుకు ముందుగా ఎలా రీచార్జి చేసుకుంటామో అదే విధంగా కరెంట్ బిల్లును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.
త్వరలో గృహాలకు
స్మార్ట్ మీటర్లను గృహాలకు ఆపై రైతుల వ్యవసాయ మోటార్లకు వీటిని అమర్చనున్నారు. దీంతో ఇళ్లకు సైతం వినియోగదారులు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే రీతిలో రైతులు వారి మోటార్ హెచ్‌పీని బట్టి ముందుగానే ఫ్రీపెయిడ్) డబ్బులు రీచార్జి చేసుకోవాలి. డబ్బులు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా కరెంట్ డిస్‌కనెక్ట్ అవుతుంది.
మీటర్ రీడర్లకు మంగళం
ఉమ్మడి జిల్లాలో వేల మంది మీటర్ రీడర్లున్నారు. వీరు ప్రతి నెలా ఇంటింటికి వెళ్లి కరెంట్ రీడింగ్‌ను బుక్ చేసి తద్వారా కరెంట్ బిల్లులు అందించేవారు. ఇకపై స్మార్ట్ మీటర్ల రాకతో వీరి ఉద్యోగాలు పోయినట్టే. దీంతో వీరు సైతం స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆందోళనలకు సైతం దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దుకాణదారులకు ఇబ్బందే..
మొబైల్ ఫోన్‌కు లాగే ముందుగా ఎంత రీచార్జి చేసుకుంటే అంత వరకే కరెంట్ ఇవ్వడం ఆపై కట్ చేయడం చేస్తే ఎవరికై నా ఇబ్బందే కదా. ఒక్కో నెలలో దుకాణంలో వ్యాపారం తగ్గుముఖం పడితే డబ్బులున్నప్పుడు పెనాల్టి కట్టి అయినా కరెంట్ బిల్లు కట్టే వెసలుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ముందుగానే కట్టాలంటే కుదిరేపనేనా. ఉన్నట్టుండి కరెంట్ పోతే జరిగే పనులులెలా. – సుభాన్, హోటల్ యజమాని, పలమనేరు
రైతులకు అవస్థలు
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రైతులకు ఇబ్బందులు తప్పవు. రైతు వరి పంట వేసి నీటి తడులు ఇవ్వాల్సిన తరుణంలో కరెంట్ చార్జీ కట్టలేదని కరెంట్ డిస్ కనెక్ట్ చేస్తే ఆ రైతు పంట ఏమి కావాలి. రైతు పంట కష్టం నేలపాలు కావాల్సిందేనా. గతంలో స్మార్ట్ మీటర్లు వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ఎలా అమలు చేస్తు న్నారు. వేరే వాళ్లు చేస్తే తప్పు.. ఆయన చేస్తే మంచిదా. – గిరిధర్ గుప్తా, సీపీఎం నేత, పలమనేరు

ఇక ‘స్మార్ట్’ బాదుడు !

ఇక ‘స్మార్ట్’ బాదుడు !