
నీచపు వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన
నగరి : మహిళను కించపరచడం దేశ సంస్కృతిని కించపరచడమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజానుద్దేశించి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన నీచపు వాఖ్యలను ఖండిస్తూ వారు శనివారం దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు. దుష్ట సంస్కృతికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. మహిళను గౌరవించడం అన్నది భారత దేశ సంస్కృతి అన్నారు. అలాంటిది రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా, నటిగా ఉన్న ఆర్కే రోజా లాంటి మహిళకే గౌరవం లేకుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణం ఎమ్మెల్యే భానుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ మహిళా అధ్యక్షులు అముద, మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, కౌన్సిలర్లు చినపాప, సాయి సంధ్యారాణి, మున్సిపల్ మహిళా కార్యదర్శి తేన్‌మొళి, రూరల్ మండల మహిళా అధ్యక్షురాలు మాబూనిషా, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, రూరల్ పార్టీ అధ్యక్షులు తిరుమలరెడ్డి, నేతవిభాగం అధ్యక్షులు బాలకృష్ణ, కన్నాయిరం, వైస్‌చైర్మన్ బాలన్, వైస్ ఎంపీపీ కన్నియప్ప, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కో–ఆప్షన్ సభ్యులు, పార్టీ కమిటీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నీచపు వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన