
ఉజ్వల భవితకు ‘నవోదయం’
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో అత్యుత్తమ విద్యనందిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లె వద్ద జవహర్ నవోదయ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధిస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య చాలా కీలకమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవీన విద్యను అందించాలన్న ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయాలు నెలకొల్పారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 29వ తేదీతో గడువు ముగియనుంది. అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దరఖాస్తులకు అవకాశం
ఈనెల 29న చివరి గడువు
గ్రామీణ విద్యార్థులకు వరం
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
జిల్లా సమాచారం
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,947
ప్రాథమికోన్నత పాఠశాలలు 158
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 51,952
ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు 10,200
దరఖాస్తుకు గడువు జూలై 29
ప్రవేశ పరీక్ష తేదీ డిసెంబర్ 13
రిజర్వేషన్లు ఇలా..
ఎస్సీలకు 15 శాతం
ఎస్టీలకు 7.5
దివ్యాంగులకు 3
బాలికలకు 33శాతం
పరీక్ష ఇలా..
పరీక్ష రకం ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
మేధాశక్తి 40 50 60
అంకగణితం 20 25 30
భాషాపరీక్ష 20 25 30
(నిమిషాలు)
దరఖాస్తులు ఇలా...
జవహర్ నవోదయ విద్యాలయాలకు విద్యార్థులు www.cbseitems.rcl.gov.in/nvs అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారై ఉండాలి.
ప్రవేశ పరీక్ష రాయబోయే విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుంటారు.
అధునాతన సౌకర్యాలు
సువిశాలమైన పాఠశాల ప్రాంగణం
శాశ్వత తరగతి గదులు, డిజిటల్ పాఠాలకు ప్రత్యేక ఏర్పాట్లు
అధునాతన కంప్యూటర్ ల్యాబ్
బాల, బాలికలకు విడివిడిగా వసతి గృహాలు
ఇంటి తరహా భోజనం, పరిశుద్ధమైన తాగునీరు
ఉదయం యోగా, వ్యాయామం సాధన
కూచిపూడి, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తారు.
పాఠ్యాంశాలతో పాటూ విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో పుస్తకాలతో కూడిన గ్రంథాలయం
పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ
త్వరగా దరఖాస్తు చేసుకోండి
ఈనెల 29వ తేదీన చివరి రోజు కావడంతో ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్‌లైతే డీఈవో కార్యాలయంలో ఉన్న పరీక్షల విభాగంలో సంప్రదించవచ్చు.
– వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు జిల్లా
ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు
నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి సిఫార్సులకు తావుండదు. తల్లిదండ్రులు, విద్యార్థులు అపోహలకు లోనవ్వకుండా పూర్తి అవగాహన, అప్రమత్తతతో ఉండాలి. పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ప్రవేశం పొందే విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం సాగించవచ్చు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – గీత, ప్రిన్సిపల్,
జవహర్ నవోదయ విద్యాలయ, వలసపల్లి అన్నమయ్య జిల్లా

ఉజ్వల భవితకు ‘నవోదయం’

ఉజ్వల భవితకు ‘నవోదయం’