
తప్పులు లేకుండా ఓటరు జాబితా
చిత్తూరు అర్బన్ : తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు బాధ్యతగా పనిచేయాలని డీఆర్‌ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు చేర్పులపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.,. బుధవారం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో చేపట్టిన బీఎల్వోల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్వోల పాత్ర కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ఓటర్ల జాబితా కోసం ఇంటింటి పరిశీలనను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. సర్వే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఓటర్ల జాబితాలో చిరునామా, ఇతర వివరాల మార్పులు చేర్పులకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సర్వేలో పారదర్శకంగా వ్యవహరించాలని, పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఏఎస్‌ఓ సౌందర్ రాజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఆర్‌డీఓ శ్రీనివాసులు, కార్పొరేషన్ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ఎ.ప్రసాద్, రూరల్, అర్బన్ తహసీల్దార్లు కులశేఖర్, జయప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు హిమగిరి పాల్గొన్నారు.