
17 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో ఈనెల 17 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం కళాశాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025 డీఈఈసెట్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ సమర్పించేందుకు అవకాశం కల్పించామన్నారు. అలాగే 13 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సీట్ అలాట్‌మెంట్ అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. సీట్ అలాట్‌మెంట్ చేసుకున్న అభ్యర్థులకు 17 నుంచి 22వ తేదీ వరకు డైట్ కార్వేటినగరం కళాశాలలోఽ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. సీట్ అలాట్‌మెంట్ అయిన వారికి ఈనెల 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు.
22 నుంచి అడ్వాన్స్డ్ తపాలా 2.0 సేవలు
చిత్తూరు కార్పొరేషన్: అడ్వాన్స్డ్ తపాలా టెక్నాలజీ 2.0తో వినియోగదారులు ఇంటి వద్ద నుంచి సేవలు పొందవచ్చని ఆ శాఖ చిత్తూరు డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. చిత్తూరు డివిజన్ పరిధిలోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 427 తపాలా కార్యాలయాల్లో ఈ విధానం అమలువుతుందన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు తపాలా కార్యాలయాల్లో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీ నుంచి తపాలా కార్యాలయాల్లో సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు. తపాలా శాఖ డాక్ సేవా యాప్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం
చిత్తూరు లీగల్: న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. మంగళవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని న్యాయసేవా సదన్ భవనంలో బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థలు, బీమా కంపెనీలకు చెందిన ఉద్యోగులతో మధ్యవర్తిత్వంపై సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం కీలకమన్నారు. దీనివల్ల సమయంతో పాటు నగదు కూడా ఆదా అవుతుందన్నారు. ప్రతి ఒక్క సంస్థ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని, దీనికి న్యాయసేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందన్నారు.
అందుబాటులో స్టాంప్ పేపర్లు
చిత్తూరు కార్పొరేషన్: నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఆర్‌ఓకు రూ.50 పేపర్లు 8వేలు, రూ.100 విలువైనవి 7వేలు, చిత్తూరు రూరల్‌కు రూ.50 పేపర్లు 7వేలు, రూ.100 విలువైనవి 7వేలు, బంగారుపాళ్యం రూ.50వి 2వేలు, రూ.100, 2 వేలు, పలమనేరు రూ.50– 5వేలు, రూ.100 –7వేలు, పుంగనూరు రూ.50– 5వేలు, రూ.100– 6వేలు, కుప్పం రూ.50– 5వేలు, రూ.100 –7వేలు, నగరి రూ.50– 6వేలు, రూ.100 –8 వేలు, కార్వేటినగరం రూ.50– 2వేలు, రూ.100– 4 వేల పేపర్లను ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేర్చినట్లు వివరించారు. మొత్తం జిల్లాలోని 8 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.50 విలువైనవి 40వేలు రూ.100 విలువైనవి 48వేలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కోర్టు ఫీజు స్టాంపులు 2.72 లక్షలు, ఎస్‌ఎ స్టాంపులు 2.16 లక్షలు, నోటరీ స్టాంపులు 2.24 లక్షలు ఉన్నాయని తెలిపారు.
ఉపాధి కోసం ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బ్యూటిఫికేషన్, రీటైల్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి దొణప్ప తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పది, ఇంటర్, డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీన బయోడేటాతో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. వివరాలకు 8328677983, 7671066532 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

17 నుంచి ధ్రువపత్రాల పరిశీలన