
మేకలు తెచ్చిన గొడవ
● యువకుడిపై కత్తితో దాడి
బంగారుపాళెం: మేకలు పొలంలో మేయడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో మేకల యజమాని పొలం యజమానిపై కత్తితో విక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని తుంబకుప్పం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అహ్మద్‌బాషాకు కొని మేకలు ఉన్నాయి. ఆదివారం మేకలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోకి వెళ్లాడు. మేకలు దళితవాడకు చెందిన రామ్‌విలాస్‌పాస్వాన్ పొలంలో పైరును మేశాయి. దాంతో పొలం యజమాని మేకల్లో ఒకదాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయంగా రాత్రి అహ్మద్‌బాషా మేకను ఎందుకు పట్టుకుని పోయావని అడగడంతో రామ్‌విలాస్‌పాస్వాన్, అతని తండ్రి బాబుఅహ్మద్‌బాషా పై దాడి చేశాడు. గ్రామస్తులు చొరవ తీసుకుని సర్దుబాటు చేసి పంపారు. సోమవారం ఇదే విషయమై అహ్మద్‌బాషా, రామ్‌విలాస్‌పాస్వాన్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అహ్మద్‌బాషా తన వద్ద ఉన్న కత్తితో రామ్‌విలాస్‌పాస్వాన్ (30)పై దాడి చేసి ఎడమ చేయి, కుడికాలుపై తీవ్రంగా గాయపరచి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన యువకుడిని స్థానికులు 108 ద్వారా బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చీలాపల్లె సీఎంసీకి రెఫర్ చేశారు. బాఽధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.