
చిత్తూరు ఎంపీ ఇంతవరకు రాలేదు
● కలెక్టరేట్ ఎదుట టీడీపీ నగరి నియోజకవర్గ నేతల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎన్నికై నప్పటి నుంచి ఇంత వరకు నగరి వైపు రాలేదని ఆ నియోజకవర్గ టీడీపీ నేత చలపతి ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు చేతబట్టి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఎంపీని చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరికి రానివ్వకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. గతంలో సైతం దివంగత ఎంపీ శివప్రసాద్ పట్ల ఇలాంటి ధోరణే అమలు చేశారని ఆరోపించారు. చిత్తూరు ఎంపీ నగరికి విచ్చేసి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలన్నారు. అనంతరం నగరి తెలుగుదేశం పార్టీలో దెయ్యం ఎవరు భూతం ఎవరంటూ ప్లకార్డులు చేతబట్టి ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
200 మీటర్ల కేబుల్ వైరు చోరీ
చౌడేపల్లె: మండలంలోని చారాల కురప్పల్లెకి తాగునీటి సరఫరాచేసే బోరుకు అమర్చిన 200 మీటర్ల కేబుల్ వైరు ఆదివారం రాత్రి చోరీకి గురైందని సర్పంచ్ విజయకుమారి తెలిపారు. వైరు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు.