
వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సువైపు విద్యార్థుల మొగ్గు
● సీఎస్‌ఈ తరువాత ఏఐ, డేటాసైన్స్, ఎమ్‌ఎల్, ఎస్‌ఎస్ కోర్సులకు డిమాండ్ ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న ప్రైవేటు కళాశాలలు ● ఏడాదికి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తున్న వైనం ● పేద విద్యార్థులకు దూరంగా సీఎస్‌ఈలోని అధునాత కోర్సులు ● మిగిలిన కోర్సులకు వెబ్ ఆప్షన్ పెడితే చాలు సీటు పక్కా
తిరుపతి సిటీ : జిల్లాలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల హడావుడి ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడినా వెబ్ ఆప్షన్ల ఎంపికపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ ఈఏఎమ్‌సెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రెండు రోజుల నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో నెట్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. సెట్‌లో మంచి ర్యాకులు సాధించిన 90 శాతం మంది విద్యార్థులు సీఎస్‌ఈ గ్రూప్‌నే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులపై కనీసం 10 శాతం మంది కూడా తొలి ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జిల్లాలో అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కా వచ్చేందుకు వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకుంటూ..
సీఎస్‌ఈ కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇదే అదునుగా రెచ్చిపోతూ ఫీజులు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ విద్యా సంస్థలలో సీఎస్‌ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్‌మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఏఐసీటీఈ గత ఏడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను ఎత్తి వేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ప్రతిష్టల ఆధారంగా యాజమాన్యాలు ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసి కేవలం రూ.70 వేలకు రసీదులు ఇచ్చి పంపుతున్నారు. తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీటు లేదంటూ వెనక్కి పంపుతారనే భయంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో వారు అడిగినంతా ఫీజు చెల్లించి వెనుదిరుగుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల దౌర్జాన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమీ చేయలేమని చేతులెత్తి కూర్చోవడం గమనార్హం.
ఇంజినీరింగ్ క్రేజ్..
ఇప్పుడంతా సీఎస్‌ఈ బ్రాంచ్ చుట్టూ తిరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పేరొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఆ గ్రూప్‌నకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్‌ఈ జనరల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఏపీఈఏమ్‌సెట్ పరీక్షకు హాజరు కాగా ఇందులో 22,500 మంది అర్హత సాధించారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు సీఎస్‌ఈ బ్రాంచ్‌లోని పలు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారంటే డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏఐ కోర్సు చేయాలని..
ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్‌లలో సీఎస్‌ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రథ మ ప్రాధాన్యం ఇచ్చాను. ఏఐకి క్రేజ్‌తో పాటు భవిష్యత్తు ఉంది. కష్టపడి చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. ఏఐ కోర్సుకు ఎస్వీయూ పరిధిలో పేరొందిన కళాశాలలకు తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్నా.
–ప్రవల్లిక, విద్యార్థిని, తిరుపతి
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని..
సాఫ్ట్ వేర్ రంగంలో రాణించాలనేది నా చిన్ననాటి కోరిక. ఏపీఈఏఎమ్‌సెట్‌లో 3 వేల లోపు ర్యాంక్ సాధించా. కచ్చితంగా పేరొందిన కళాశాలలో సీఎస్‌ఈ జనరల్ సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే వెబ్ ఆప్షన్ తొలి ప్రాధాన్యతగా సీఎస్‌ఈ జనరల్, రెండో ప్రాధాన్యతగా ఈఎస్‌ఈకి ఇచ్చా. – రజిని, విద్యార్థిని, తిరుపతి
డేటా సైన్స్, ఏఐ ఆప్షన్లు పెట్టాను
ఏపీఈఏఎమ్‌సెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. డేటా సైన్స్ లేదా ఏఐ చేయాలని ఉంది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం డేటా సైన్స్, రెండో ప్రాధాన్యం ఏఐకి ఇచ్చాను. కచ్చితంగా నేను అనుకున్న కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఫారిన్‌లో ఎమ్‌ఎస్ చేయాలని ఉంది.
– పృఽథ్వి, విద్యార్థి, తిరుపతి

వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సువైపు విద్యార్థుల మొగ్గు

వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సువైపు విద్యార్థుల మొగ్గు

వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సువైపు విద్యార్థుల మొగ్గు