
దేవదాయ భూములను పరిరక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా దేవదాయ భూములను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో దేవదాయ భూముల పరిరక్షణ పై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17,540 ఎకరాల దేవలయ భూములున్నాయన్నారు. ఈ భూములన్నింటినీ సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నట్‌లైతే వెంటనే గుర్తించి తొలగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,343.17 ఎకరాల దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఏవైనా కోర్టు కేసుల్లో ఉన్నట్‌లైతే స్టే వెకేషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 9,761 ఎకరాలకుగాను 4,866 ఎకరాల భూములు 1 బీ అడంగళ్‌లో దేవదాయ పేర్లుగా నమోదు చేశారన్నారు. 5,500 ఎకరాలకు 1 బీలో పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా 2,200 ఎకరాల భూములను వెంటనే 1 బీ అడంగల్‌లో నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దేవదాయ భూములను తక్కువ ధరకు వేలంలో లీజుకు ఇస్తున్నారని తమ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివాదాస్పద భూములన్నింటినీ సర్వే చేయించాలని సూచించారు. జాయింట్ సర్వే పెండింగ్‌లో ఉన్న భూములను ఆయా శాఖల సమన్వయంతో 30 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా దేవదాయ శాఖ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు.