
ఎన్నికల అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం
సదుం: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వి జయం ఖాయమని, తరువాత టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డితో కలసి గురు వారం బాబు షూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరకాలంగా చంద్రబాబు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేసి, ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ కోసం కష్టపడుతున్నవారిని వేధించడమే పని గా పెట్టుకున్నారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకనే నిస్సిగ్గుగా అమలు చేస్తున్నట్లు ప్రకటించడం ఆయనకే చెల్లిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనలేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కడం చంద్రబాబు నైజమన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మామిడి కిలో రూ. 2 పలకడం తన జీవింతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక రాష్ట్రం కిలో రూ.16 మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం లక్షలాది టన్నులు కొనుగోలు చేస్తుంటే, ఢిల్లీకి మంత్రిని పంపి, కిలోకు రూ.4 ధరతో రూ. 260 కోట్లు చాలని కోరడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు.
హామీల పేరుతో మోసం
జగన్ అమలు చేసిన సంక్షేమం కంటే మరింత ఎక్కువ చేస్తానని ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు కరుణాకరరెడ్డి తెలిపారు. కూటమి పాలనలో అరాచకాలే మిగిలాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను జైళ్లకు పంపుతున్నారని, 680 మంది సోషియల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ప్రభుత్వం 2 వేల మంది పోలీసులు ఎంత ఇబ్బందులు పెట్టినా బంగారుపాళెంలో మామిడి రైతులు నిర్వహించింది కవాతు అని చెప్పారు. బంగారుపాళెం పర్యటన చూసి జిల్లాలో వైఎస్సార్‌సీపీ సత్తా ఏమిటో వారికి తెలిసివచ్చిందన్నారు. పార్టీ కార్యక్రమాలు చూసి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కొన్ని పచ్చ పత్రికలు ఏ రోజూ నిజం రాయవని, వైఎస్సార్‌సీపీపై నిందలు లేకుండా ఒక వార్తా రాయలేరని అన్నారు. బంగారుపాళెం పర్యటనను దండుపాళెం బ్యాచ్‌గా వర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు దండుపాళెం బ్యాచ్ అయితే టీడీపీ నాయకులు వారికి వేదపండితులు, మునులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, పోకల అశోక్ కుమార్, ఫకృద్ధిన్, చెంగారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.