
టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆగ్రహం
బంగారుపాళెం: ‘టీడీపీ ఉడత బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడే ప్రసక్తేలేదు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తమ కష్టాలను చెప్పకునేందుకు వచ్చిన రైతులపై కూటమి సర్కారు పోలీసులతో లాఠీచార్జి చేయించడం దారుణం.’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన బంగారుపాళెంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎంకు రైతులు కష్టాలు చెప్పుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో రైతులను దండుపాళెం బ్యాచ్‌తో పోల్చడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులతో అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. మీడియా ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు జనం కరువయ్యారంటూ మొదటి పేజీలో ఫొటో పెట్టారన్నారు. 13వ పేజీలో 10 వేల మంది జనం వచ్చారని రాసుకోచ్చారన్నారు. మరి 10 వేల మంది జనం ఫొటోను ఎందుకు పెట్టలేకపోయారని మండిపడ్డారు. జగన్ పర్యటనకు రానీయకుండా బంగారుపాళేనికి 30 కిలోమీటర్ల అవతల నుంచి ఆంక్షలు విధించి, బారికేడ్లు పెట్టి, బెదిరించి రానీయకుండా చూశారన్నారు. అవేవీ లెక్క చేయకుండా రైతులు, అభిమానులు బంగారుపాళేనికి తరలిరాచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి కాదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే, తానూ ఎమ్మెల్యేనే అంటూ సవాల్ చేయడం మంచిపద్ధతి కాదన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎమ్మెల్యే జూస్ ఫ్యాక్టరీ యజమానుల వద్ద కమీషన్లు తీసుకుని రైతులకు అన్యాయం చేసి, వారి కడుపుకొట్టారని ఆరోపించారు. మామిడికి గిట్టుబాటు ధర రాక మామిడి చెట్లను నరికి వేస్తున్నారని, అ విషయం ప్రభుత్వం కళ్లకు కనిపించలేదా? అని మండిపడ్డారు. జగన్ పర్యటలో మద్యం, బిరియాని పంపిణీ చేశామని ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సత్యప్రమాణం చేయగలరా? అని సవాలు విసిరారు. నాయకులకు నోటీసులు అందించి, కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రైతులు ఆవేదన చెంది మామిడి కాయలను రోడ్డుపై పడేెస్తే దానిపైనా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు. మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, కుమార్‌రాజా, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షడు పాలాక్షిరెడ్డి, మాజీ సర్పంచులు ప్రకాష్‌రెడ్డి, కృష్ణమూర్తి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు గజేంద్ర, నాయకులు పరదేశి, మహేంద్ర, రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు.