
పుత్తూరులో 293 కేసుల పరిష్కారం
పుత్తూరు: స్థానిక సబ్‌కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో మొత్తం 293 కేసులను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎస్‌సీ.రాఘవేంద్ర తెలిపారు. కక్షిదారుల మధ్య రూ.2,44,28,593 రాజీ చేసినట్లు పేర్కొన్నారు. 257 క్రిమినల్ కేసులు, 24 సివిల్, 12 ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన పుత్తూరు కళ్యాణపురానికి చెందిన అశోక్, పవిత్ర దంపతులకు న్యాయమూర్తులు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక్కటి చేశారు. లోక్ అదాలత్ ప్రిసీడింగ్ ఆపీసర్లుగా సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌సీ.రాఘవేంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీ.జానకి, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి రమ్యసాయి వ్యవహరించారు. లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లుగా న్యాయవాదులు ఎం.విజయ్‌కుమార్, ఎస్.లక్ష్మీపతి, ఎడీ.బాలాజీ వ్యవహరించారు. లోక్‌అదాలత్‌ను పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం అందజేశారు. పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.