
జగన్ జనాదరణను అడ్డుకోలేరు
తిరుపతి కల్చరల్ : పంటకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతూ తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనలో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే చర్యలు రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపోతున్న మామిడి రైతుల పరామర్శకు మాజీ సీఎం మార్కెట్ యార్డుకు రావడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పర్యటనలో ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడమే కాక వారిని దూర ప్రాంతాలకు తరలించి నిర్భంధించడం దుర్మార్గ చర్య అన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ నిర్భంధాలకు పూనుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు సంఘం నేతగా తనతో మరో 30 మందిని జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకొని నిర్భంధించడమే కాక కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వ్యవహరించడం చూస్తే పోలీసులు కూటమి ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే కేసులు పెడతామని, రౌడీషీట్ పెడతామని స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఒక అవివేకని విమర్శించారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కేంద్ర సహకారంతో మామిడి కిలో రూ.16 కల్పిస్తే ఆంధ్రాలోని మామిడి రైతులు నష్టపోతున్నా నోరు మెదపక, శ్రీవారి దర్శనాలే ప్రరమావధిగా వ్యవహరించే బీజేపీ నేత పసలేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వెంకటేష్‌రెడ్డి, కె,వెంకటాచలం పాల్గొన్నారు.