రూ.17,809 కోట్లతో రుణ ప్రణాళిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రూ.17,809 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ బుధవారం కలెక్టరేట్‌లో రుణ ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డీఎల్‌ఆర్, డీసీసీ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడేలా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రైతులకు వివిధ రకాల రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి బ్యాంకర్లు తోడ్పాటునివ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో భాగంగా నిర్ధేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు కచ్చితంగా చేరుకోవాలన్నారు.
ఇందులో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు. అదేవిధంగా పంటలకు రుణాలు, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమకు షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ రుణాలను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు పరిశ్రమల స్థాపనకు రుణాలను మంజూరు చేయాలన్నారు. స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌బీఐ ఏపీఆర్‌వో రోహిత్ అగర్వాల్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్‌డీఎం హరీష్, డీసీసీ కన్వీనర్ ఇందిరా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి
రుణాల మంజూరులో అలసత్వం వద్దు
బ్యాంకర్లు కచ్చితంగా రుణ లక్ష్యాలను చేరుకోవాలి
వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
2025–26 వార్షిక రుణ ప్రణాళిక
2025–26 సంవత్సరానికి జిల్లా క్రెడిట్ ప్లాన్ ప్రాధాన్యతా రంగంలో మొత్తం క్రెడిట్ వ్యయం రూ.17,809.37 కోట్లు.
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వివిధ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు 815145 ఖాతాలకు రుణాలు ఇవ్వడం.
ప్రాధాన్యత లేని రంగానికి రూ.2,787.17 కోట్లు కేటాయింపు, ఈ మొత్తం క్రెడిట్ వ్యయం రూ.17,809.37 కోట్లు.
వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు కేటాయింపులు రూ.12,195.27 కోట్లు. ఈ రంగంలో దాదాపు 6.38 లక్షల మంది రైతులు, భూమిలేని కార్మికులకు సహాయం.
చిన్న – సూక్ష్మ పరిశ్రమల రంగానికి కేటాయింపులు రూ. 2,216.07 కోట్లు.
ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.220.81 కోట్లు.
వాణిజ్య బ్యాంకుల వాటా రూ.11,843.43 కోట్లు. ఇది జిల్లా క్రెడిట్ ప్లాన్‌లో 66.50% వాటా.


