
రీవాల్యుయేషన్‌లో అక్ర‘మార్కులు’!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎస్వీయూలో డిగ్రీ, పీజీ పరీక్ష పేపర్ల రీ–వాల్యువేషన్ ప్రక్రియలో జరుగుతున్న గోల్‌మాల్‌ను అధికారులు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో వర్సిటీలోని కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిగ్రీకి సంబంధించిన పలు పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వచ్చాయంటూ వందల సంఖ్యలో రీవాల్యువేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అవకాశంగా ఎగ్జామినేషన్ సెక్షన్‌లో పనిచేస్తున్న కొందరు ఎక్కువ మార్కులు వేయిస్తామంటూ వేలల్లో వసూలు చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు ఎగ్జామినేషన్ సెక్షన్‌లో పనిచేసే ఓ అధికారి వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం! ఇదే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని సెమిస్టర్ల డిగ్రీ, పీజీ పరీక్ష పేపర్ల రీవాల్యువేషన్‌లో మళ్లీ తప్పులు దొర్లడంతో అధికారులకు అనుమానం వచ్చి ఉద్యోగులను నిలదీశారు. రీవాల్యువేషన్ చేసిన పేపర్లను తమ ముందు ఉంచాలని ఎగ్జామినేషన్ సెక్షన్ సిబ్బందిని నిలదీశారు. ఈ పరిస్థితిని ఊహించని ఎగ్జామినేషన్ సిబ్బంది కొందరు తెల్లముఖం వేసినట్లు తెలుస్తోంది.