
అయ్యా.. మా మొర ఆలకించరా?
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 234 అర్జీలు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. మా మొర ఆలకించండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గత రెండు వారాల తర్వాత ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 232 అర్జీలు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. మూడు నెలల పాటు పలమనేరు డివిజన్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించామన్నారు. చిత్తూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో దాదాపు 250 అర్జీలు వచ్చాయన్నారు. ఇందులో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నట్టు వెల్లడించారు. పలమనేరులో పీజీఆర్‌ఎస్ నిర్వహించడం వల్ల పలమనేరు డివిజన్ నుంచి అందే అర్జీల సంఖ్య తగ్గినట్టు పేర్కొన్నారు.
శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించండి
శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని చిత్తూరు రూరల్ మండలం, బీఎన్‌ఆర్‌పేట రెవెన్యూ, అనంతాపురం ఎస్సీ కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ గ్రామానికి చెందిన సుకన్య, కవిత తదితరులు మాట్లాడారు. గత 40 ఏళ్లుగా శ్మశానవాటికకు వినియోగిస్తున్న స్థలంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

అయ్యా.. మా మొర ఆలకించరా?