
జాతరకు కట్టుదిట్టమైన భద్రత
● చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో గంగ జాతర జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన సోమవారం చిత్తూరులోని ఏఆర్ మైదానంలో జాతర విధులు కేటాయించిన పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. చిత్తూరు జాతరకు దాదాపు 500 మంది పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. అలాగే డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్టు తెలిపారు. ట్రాఫిక్‌ను నిత్యం పర్యవేక్షించడంతోపాటు వాహనాల మళ్లింపుపై దృష్టి పెట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం జాతర ధర్మకర్త లావణ్యతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, శివానందకిషోర్, డీఎస్పీలు సాయి నాథ్, సయ్యద్ మొహ్మద్ అజీజ్, చిన్నికృష్ణ, మహబూబ్ బాష, సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య తదితరులు పాల్గొన్నారు
సదుం తహసీల్దార్‌గా జయప్రకాష్
చిత్తూరు కలెక్టరేట్: సదుం తహసీల్దార్‌గా కుప్పం డివిజనల్ పరిపాలనాధికారిగా పనిచేస్తున్న జయప్రకాష్‌ను నియమిస్తూ సోమ వారం కలెక్టర్ సుమిత్‌కుమామార్ ఉత్తర్వులు జారీచేశారు. అక్కడ ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా ఉన్న హుస్సేన్ అవినీతినిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు జయప్రకాష్‌ను నియమించారు.