
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
చిత్తూరు కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎటువంటి రక్షణా లేదన్నారు. మాజీ మహిళా మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి, చేయి చేసుకోవడం దారుణమన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని నిలదీశారు. సీఐ సుబ్బనాయుడు ఆమె పట్ల దురుసుగా ప్రరవర్తించడం సిగ్గుచేటన్నారు. ఒక బీసీ ప్రజాప్రతినిధిపై ఇలా ప్రరవర్తించడం సరికాదన్నారు. మాజీ మంత్రి వద్ద ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటే వారెంట్ లేదా ఎఫ్‌ఐఆర్ చూపాలని, ఎటువంటి నోటీసులూ లేకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి కక్ష్య సాధింపుపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు. అనంతరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలిరెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు సరళమేరీ, గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు నారాయణలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఏ సంక్షేమ పథకమూ అమలు చేయలేదన్నారు. రజనీపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బనాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, ఎంపీటీసీ ప్రతిమారెడ్డి, నాయకులు నౌషద్, చల్లాముత్తు, గిరి, చంద్ర, మదన్, కవిత, బిందు, శాంతి, దీనదయాళ్, భువన, రాజేష్, హరీషారెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.