
రిజిసే్ట్రషన్లకు అగచాట్లు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలోని క్రయ, విక్రయదారులకు చుక్కలు చూపిస్తోంది. నెలలు గడుస్తున్నా స్టాంపు పేపర్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆస్తుల కొనుగోలు, విక్రయాలు చేసేవారు అగచాట్లు పడుతున్నారు. సమస్య కొన్ని నెలలుగా ఉన్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టాంపుల కొరతను సాకుగా చూపి వెండార్లు ధరలు రెట్టింపు చేశారు. కొంత మంది రూ.100 స్టాంపును రూ.200కు విక్రయిస్తున్నారు. గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని క్రయ విక్రయదారులు వాపోతున్నారు.
●
పిచ్చాటూరు వెళ్లి కొన్నా..
మా ఆస్తుల సెటిల్‌మెంట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అయితే అవసరమైన స్టాంప్ పేపర్లు నగరిలో లేవు. రిజిష్ట్రార్ కార్యాలయంలో రెండు పత్రాలు మాత్రమే ఇచ్చారు. దీంతో తిరుపతి జిల్లా పిచ్చాటూరుకు వెళ్లి స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశా. ప్రింటింగ్‌లో ఏదైనా పొరపాటు జరిగితే మళ్లీ స్టాంపులు కొనాల్సి వస్తుందేమోననే భయంతో రెండు పేపర్లు అదనంగానే కొనాల్సి వచ్చింది.
– గురుమూర్తి, టివి కండ్రిగ, నగరి మండలం
ఈ–స్టాంపులతోనూ చేసుకోవచ్చు
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సబ్ రిజిస్‌ట్ష్‌ట్రార్ కార్యాలయాలకు స్టాంపులు అందుతాయి. సమస్య వారి దృష్టికి తీసుకెళ్లగా త్వరలో పంపుతామని చెప్పారు. రూ.10, రూ.20 స్టాంపులు ఇస్తున్నాం. ఇవేకాకుండా ఈ–స్టాంపులతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
– సత్యప్రసాద్, సబ్ రిజిస్ట్రార్, కార్వేటినగరం
● నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కొరత
● స్టాంపు ధరలకు రెక్కలు
● రెట్టింపు ధరలు వసూలు చేస్తున్న వెండార్లు
● కొన్ని నెలలుగా కొరతతో అవస్థలు
● స్టాంపులు చేతికొచ్చాకే స్లాట్ బుకింగ్‌లు
నగరి : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పందాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు వినియోగించే రూ.100, రూ.50, రూ.20, రూ.10 విలువ గల స్టాంపు పేపర్లకు కొరత ఏర్పడింది. చిత్తూరు, చిత్తూరు రూరల్, నగరి, పలమనేరు, పుంగనూరు, కార్వేటినగరం, కుప్పం, బంగారుపాళెం 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్లతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం స్టాంపుల కొరత కారణంగా రిజిస్ట్రేషన్లకు ప్రజలు అగచాట్లు పడుతున్నారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు స్టాంపులకు మించి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని కార్యాలయాల్లో రూ.100, రూ.50 స్టాంపులు లేక రూ.20, రూ.10 స్టాంపులు మాత్రమే అందిస్తున్నారు. స్టాంప్ వెండర్స్ వద్ద కూడా స్టాంపులు లభించడం లేదు.
నిలిచిన సరఫరా
స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగతాది జిల్లా రిజిస్ట్రార్ సరఫరా చేస్తోంది. స్టాక్ పూర్తి కాకముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. అయితే అక్కడ చెల్లించాల్సిన బకాయిలు ఉండటంతోనే స్టాంప్ పేపర్లు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇతర ప్రాంతాలకు పరుగులు
రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఉండటంతో తక్కువగా జరిగే కార్యాలయాలకు పరుగులు తీసి అక్కడి నుంచి స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అలా తెచ్చుకున్న పేపర్లు ప్రింట్ తీయడంలో పొరపాటు జరిగితే మళ్లీ పేపర్ల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రయ విక్రయదారులకు చుక్కలు చూపిస్తోంది. స్టాంపుల కోసం తిరగలేనివారు ఒకటి రెండు పేపర్లతో పాటు తెల్లబాండ్ పేపర్లు వాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించేస్తున్నారు. నెలలు గడుస్తున్నా స్టాంప్ పేపర్ల కొరత సమస్య పరిష్కారం కాకపోవడం ఆస్తులు కొనుగోలు, విక్రయాలు చేసేవారికి ఇబ్బందికరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
నాడు రాద్దాంతం.. నేడు ఆధారం
గత ప్రభుత్వం ఈ–స్టాంపు విధానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రాద్దాంతం చేసింది. ఫిజికల్ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులు చూడటానికి జిరాక్స్ పేపరు మాదిరిగా ఉందని ప్రింటర్ నుంచి తీసే ఈ–స్టాంపు పేపరుపై అక్షరాలు కొద్ది కాలానికే చెరిగిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లభించకపోవడంతో ఈ– స్టాంపులను వాడుకోవాలని కూటమి ప్రభుత్వం సూచిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ–స్టాంప్‌ల ధరలకు రెక్కలు వచ్చాయి. స్టాంపు ధరకు రెట్టింపు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి ఉంది.
అధిక ధర వసూలు
కొందరు వెండార్ల వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ డిమాండ్ సృష్టిస్తూ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 స్టాంపు రూ.50కి రూ.100 స్టాంపు రూ.200కు విక్రయాలు జరుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ధర ఎక్కువైనా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగిన విధంగా స్టాంపులు లభించని పరిస్థితి నెలకొంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు లభించే కొద్దిపాటి పేపర్లతోనే కొనసాగుతున్నాయి. ఆ నిల్వలు ఖాళీ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

రిజిసే్ట్రషన్లకు అగచాట్లు

రిజిసే్ట్రషన్లకు అగచాట్లు

రిజిసే్ట్రషన్లకు అగచాట్లు