స్కెచ్‌లో దర్శనం | - | Sakshi
Sakshi News home page

స్కెచ్‌లో దర్శనం

May 9 2025 2:06 AM | Updated on May 9 2025 2:10 AM

స్కెచ

స్కెచ్‌లో దర్శనం

నేలపై మాయం..

రాజు కాలువ కబ్జా కథ

కుప్పంరూరల్‌: కూటమి ప్రభుత్వం రాగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. కొంత మంది అక్రమార్కులు అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తుండగా, మరికొంత మంది చుట్టు పక్క ఉన్న డీకేటీ, ప్రభుత్వ స్థలాలు, రాజు కాలువలను కలుపుకుని లే అవుట్‌ వేశారు. ప్రశ్నించాల్సిన అధికారులు ఏటు వైపు నుంచి ఒత్తిళ్లు వస్తాయోనని మిన్నకుండిపోతున్నారు. దీంతో కాలువలు, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కుప్పం పట్టణానికి అనుకుని ఉన్న ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న చీమనాయనపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 99/3లో కొంత మంది రియల్‌ వ్యాపారులు లే అవుట్‌ వేశారు. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఈ స్థలం ఎంతో విలువైనదిగా గ్రహించిన రియల్టర్లు 99/3లో ఉన్న రాజు కాలువను సైతం ఆక్రమించుకున్నారు. రాజు కాలువ వారు కొనుగోలు చేసిన స్థలం మధ్యన ఉండడంతో మట్టి పోసి రాజుకాలువను మాయం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా లే అవుట్‌ రాళ్లను పూడ్చి అమ్మకానికి సిద్ధం చేశారు. రాజుకాలువ నేలపై మాయమై, లే అవుట్‌ స్కెచ్‌లో ప్రత్యక్షమైంది. ఇలా కాలువ పూడ్చి వేసి, విలువైన స్థలాన్ని రికార్డుల్లో మాత్రం అలాగే ఉంచారు. దీంతో భారీ వర్షాలు వస్తే నీరు బయటికి పోకుండా అక్కడే నిలువ ఉండిపోయే ప్రమాదం ఉంది. నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటే ఎగువ నుంచి వచ్చే నీరు బయటికి పోలేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రమాదం ఉందని తెలిసి, అందులోను నిత్యం రాష్ట్రం, జిల్లాస్థాయి అధికారులు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కన విలువైన రాజుకాలువను అక్రమిస్తే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కడా పీడీ అయినా స్పందించి రాజుకాలువను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

రాజుకాలువను ఆక్రమించి వేసిన లే అవుట్‌

స్కెచ్‌లో దర్శనం1
1/1

స్కెచ్‌లో దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement