
పలమనేరులో భారీ వర్షం
● నేలరాలిన మామిడి, ● దెబ్బతిన్న తీగ పంటలు
పలమనేరు: మండలంలో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు పెనుగాలులు వీచాయి. దీంతో పలుచోట్ల మామడికాయలు నేల రాలాయి. కోతకొచ్చిన టమాట దెబ్బతింది. ఇక తీగ పంటలైన కాకర, బీర, బీన్స్ పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల అరటి పంటకు నష్టం వాటిల్లింది. పెనుగాలులతోపాటు అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసింది. దీంతో మామిడి కాయలకు మచ్చలు పడ్డాయి. వీటికి మార్కెట్‌లో ధర ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటల్లో రాలిన మామిడిని తక్కువ ధరతో అమ్ముకోవాలని చెప్పారు. ముఖ్యంగా పెంగరగుంట, సముద్రపల్లి, కరిడిమొడుగు, బయ్యప్పగారిపల్లి పంచాయతీల్లో మామిడి తోటలకు ఎక్కువగా నష్టం జరిగింది. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యానశాఖ అధికారి లక్ష్మీప్రసూనను వివరణ కోరగా వర్షానికి దెబ్బతిన్న పంటలను గురువారం పరిశీలించి, తగు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
పట్టణంలో అంధకారం
వర్షం కారణంగా పలమనేరు పట్టణంలోని రాధాబంగ్లాతోపాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అంధకారం నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, నాగమంగళం హైవేవద్ద వర్షపునీరు నిలిచింది.

పలమనేరులో భారీ వర్షం

పలమనేరులో భారీ వర్షం