
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం
మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపు
నగరి : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని మాజీ మంత్రి ఆర్కే రోజా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. బుధవారం నగరి పట్టణంలోని తన నివాసంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విభాగాలు, అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు ఇకపైన యాక్టివ్ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి అటకెక్కాయని, ఆస్పత్రుల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ, రేషన్ డోర్ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా ఆగిపోయయాయన్నారు. వ్యవసాయం సహా విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందుతోందన్నారు. పాలనలో పారదర్శకత లేదన్నారు. అభివృద్ధికి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయన్నారు. వీటిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి వారికి అండగా ఉండి పోరాడాలన్నారు. ఈ సమావేశాల్లో నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు పీజీ నీలమేఘం, హరి, పార్టీ అనుబంధసంఘాల నేతలు పాల్గొన్నారు.