
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, సర్వేయింగ్ కోర్సులకు ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువతి, యువకులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సులకు పదో తరగతి, ఆపై కోర్సులు చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసే అభ్యర్థులకు ఏపీఎస్‌ఎస్‌డీ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9704762155, 7396631623 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఉన్న స్కిల్ హబ్ కేంద్రంలో ఈ నెల 9 వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
ఐదు కేంద్రాల్లో నేడు ఐసెట్
తిరుపతి సిటీ: తిరుపతి జిల్లావ్యాప్తంగా ఐదు పరీక్షా కేంద్రాలలో ఐసెట్–2025 బుధవారం నిర్వహించనున్నారు. జిల్లాలో గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పుత్తూరు ఎస్వీ పెరుమాళ్ ఇంజనీరింగ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, తిరుపతి జూపార్క్ సమీపంలోని ఐయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో సుమారు 5వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు 300 మంది గైర్హాజరు
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ రాత పరీక్షకు 300 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 911 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 611 మంది మాత్రమే వచ్చారని తెలియజేశారు. ఆయా కేంద్రాల్లో అభ్యర్థులకు తాగునీటితోపాటు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.
ఉరుములు.. మెరుపులతో వర్షం
కాణిపాకం: చిత్తూరు, పూతలపట్టు నియోజవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. అర్ధగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. చాలా చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
అపార్ట్‌మెంట్ పైనుంచి పడి వాచ్‌మన్ మృతి
తిరుపతి రూరల్: పూతలపుట్టు – నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్డెన్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి సోమవారం అర్ధరాత్రి కాలుజారి కింద పడడంతో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. రేణిగుంట మండలం, అన్నసామిపల్లికి చెందిన మునిశేఖర్ (32) 2020 నుంచి గార్డెన్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ 6వ అంతస్తులోని పెంట్ హౌస్‌లో నివాసముంటున్నాడు. మునిశేఖర్ భార్య రోజావతి అక్కడే స్వీపర్‌గా పనిచేస్తుండగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునిశేఖర్ మద్యం మత్తులో 6వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు. ఆ వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు చికిత్స నిమిత్తం అతన్ని రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.