
ఆదిత్యం.. ‘ఆద’ర్శం
విద్యుత్ నేడు నిత్యావసరం.. జల, థర్మల్, అణు కేంద్రాలే ప్రస్తుతం కరెంట్ ఉత్పత్తికి మూలం.. ఇవన్నీ తరగిపోయే ఇంధన వనరులే కాకుండా కాలుష్యకారకం.. వెరసి.. వాతవారణం కలుషి తం.. పర్యావరణ విద్యుత్ ఉత్పత్తికి సౌరఫలకం ఒక్కటే మార్గం.. దీని ఏర్పాటుతో బిల్లులు ఆదాతోపాటు మిగులు గ్రిడ్‌కు విక్రయంతో వినియోగదారుడికి ఆదాయం.. పర్యావరణ హితం. ఈ దిశగా కేంద్రం అడుగు వేస్తోంది. అందుకు ఆదర్శగ్రామాలు ఎంపిక చేసి, ఉత్తమ ఉత్పత్తి గ్రామాలకు ప్రోత్సాహకం అందించనుంది. దీనిపై ప్రత్యేక కథనం.
చిత్తూరు కార్పొరేషన్: రానున్న రోజుల్లో జనాభాతో పాటు విద్యుత్ వాడకం పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇందుకోసం సూర్యఘర్ యోజన పథకం అమలు చేసింది. ఈ పథకం కింద పలు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. పట్టణాల కన్నాపల్లెల్లో సౌరవిద్యుత్ వినియోగంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సౌరవిద్యుత్‌పై ఆసక్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇందుకు జిల్లాల పరిధిలో నియోజకవర్గాల వారీగా 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లో కిలోవాట్ నుంచి మూడు కిలోవాట్ల వరకు సోలార్ ప్యానల్స్‌ను అమర్చుకుంటే రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.78 వేలు చొప్పు లబ్ధిదారులకు రాయితీ అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో ట్రాన్స్‌కో అధికారులు చిత్తూరు జిల్లా పరిధిలో ఎంపిక చేసిన పంచాయతీలోని స్థానికులకు సోలార్ పవర్ ఉత్పత్తికి అందిస్తున్న ప్రోత్సాహకాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారులు తమ దరఖాస్తులను పీఎం సూర్యఘర్ జీఓవీ.ఇన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంపై విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు.
మోడల్ గ్రామాలివే
చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో పెనుమూరు గ్రామం, గుడిపాలలో బొమ్మసముద్రం, విజయపురంలో పల్లూరు, చౌడేపల్లెలో చౌడేపల్లె, పులిచెర్లలో కల్లూరు గ్రామాలను గ్రామ పంచాయతీలను మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేశారు.
5 వేలకు పైగా జనాభా కలిగిన ఈ పంచాయతీల్లో వందశాతం ఇళ్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన పంచాయతీకి రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ నిధులను వివిధ అభివృద్ధి పనులకు వినియోగించుకునే సౌలభ్యం ఉంటుంది. వ్యక్తిగతంగా కరెంటు బిల్లు తగ్గించుకోవడంతోపాటు పర్యావరణ పరంగా ప్రయోజనాలను నిర్ధేశించారు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు ఎన్ని యూనిట్లు సరఫరా చేస్తారో.. ఆ మేరకు నగదు కూడా అందజేస్తారు. నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలన్న లక్ష్యం నిమిత్తం సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గాలపై కార్యచరణ చేపట్టనున్నారు.
సౌరశక్తితో ఇంధనం ఆదా
మోడల్ గ్రామానికి రూ.కోటి ప్రోత్సాహకం
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
వందశాతం సోలార్ విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం
ప్రచారం చేస్తాం
మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసిన పంచాయతీల పరిధిలో మరింత ప్రచారం చేస్తాం. ప్రజలు భవనాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలి. వీటి ద్వారా పొందే లబ్ధిని క్షేత్రస్థాయిలో తెలియజేయనున్నాం. గ్రామాల్లో సోలార్ పవర్‌పై పెద్ద ఆసక్తి చూపడం లేదు. ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్‌లో ఎంతో ఉపయోగం. మీ విద్యుత్ మీరే ఉత్పత్తి చేసుకుని మిగిలిన యూనిట్లను గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు. వందశాతం సోలార్‌ను వినియోగించుకున్న పంచాయతీకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రూపాయలను ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. దీంతో పంచాయతీలో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చు.
– ఇస్మాయిల్ అహ్మద్, ఎస్‌ఈ ట్రాన్స్‌కో

ఆదిత్యం.. ‘ఆద’ర్శం

ఆదిత్యం.. ‘ఆద’ర్శం