
రాయితీ విత్తనాలు రెడీ
ఖరీఫ్ సీజన్‌లో సాగుకు అవసరమైన వేరుశనగ విత్తన కాయలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులకు పంపిణీ చేసేందుకు అవసరమైన కాయలను ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాలకు చేర్చింది. రాయితీపై వీటిని అన్నదాతలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. వేరుశనగ విత్తన కాయలు కావల్సిన వారు ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు వ్యవసాయశాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది.
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలోని రైతులు ఏటా ఖరీఫ్‌లో వర్షాధార పంటగా వేరుశనగను సాగు చేస్తుంటారు. ఈ సీజన్‌లో కూడా మొత్తం 43,174 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వేరుశనగను సాగు చేస్తారని అఽధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో రబీ సీజన్‌లో పండించిన వేరుశనగ కాయలను రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసింది. సేకరించిన కాయలను శుద్ధి చేసి రాయితీపై అన్నదాతలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,655 క్వింటాళ్ల కాయలను ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు సరఫరా చేసింది. ఈ నెల 23వ తేది నుంచి విత్తనాలను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకుగాను కాయలు కావల్సిన రైతులు ఆయా రైతు భరోసా కేంద్రంలో ముందస్తుగా నమోదు చేసుకోవాలని తెలియజేసింది.
సబ్సిడీతో సరఫరా
రైతులకు 40 శాతం రాయితీపై వేరుశనగ విత్తన కాయలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కే6 రకం కాయలు క్వింటాల్‌కు రూ. 9,500 ధర నిర్ణయించగా , 40 శాతం రాయితీ కింద రూ.3,800 పోను రూ.5,700 చొప్పున ధర నిర్ణయించింది. అదేవిధంగా నారాయణి రకం కాయలు క్వింటాల్ రూ.9,700 ధర నిర్ణయించగా , 40 శాతం రాయితీ కింద రూ. 3,880 పోను రూ. 5,820 మేరకు ధర నిర్ణయించింది. దీంతో కె6 రకం బస్తా (30 కేజీలు) రూ. 1,710 , నారాయణి రకం బస్తా (30 కేజీలు) రూ. 1,746 చొప్పున చెల్లించి రైతులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
23 నుంచి వేరుశనగ కాయల పంపిణీ
కిలోకు 40 శాతం సబ్సిడీ
బస్తా ధర రూ. 1,710
జిల్లాకు 38,655 క్వింటాళ్ల కేటాయింపు
పకడ్బందీగా పంపిణీ
రైతులకు రాయితీ విత్తన కాయలను పకడ్బందీగా పంపిణీ చేస్తాం. ఇప్పటికే జిల్లాకు చేరిన విత్తన కాయలను ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాలకు చేర్చాం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అందరికీ విత్తనాలు అందించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నాం. – మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

రాయితీ విత్తనాలు రెడీ