
మాట్లాడుతున్న కలెక్టర్ హరినారాయణన్, పక్కన మేయర్ అముద, ఏఎస్పీ జగదీష్
సాక్షి, చిత్తూరు : ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ అముద తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమశాఖ అధ్వర్యంలో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఎస్సీ,ఎస్టీలు బలోపేతం కావాలని సూచించారు. కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీలు, ఎస్టీల కోసం 300 శ్మశానవాటికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళితుల సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు సైతం ఏమాత్రం అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. భూ పంపిణీకి అర్హులైనవారి వివరాలను సేకరించి వారికి పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఏఎస్పీ జగదీష్ అట్రాసిటీ కేసుల పురోగతిని వివరించారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
పన్ను చెల్లింపునకు రేపే ఆఖరు
చిత్తూరు అర్బన్: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపునకు ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తోంది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద నిర్దేశిత గడువులో పన్ను మొత్తం చెల్లించేవాళ్లకు వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్‌కు దాదాపు రూ.26 కోట్లు ఆస్తిపన్ను రూపంలో వసూలైంది. పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు సుమారు రూ.14 కోట్లకు పైగా పన్నులు వసూలు చేశాయి. మిగిలిన రెండు రోజుల్లో బకాయిలు రాబట్టడానికి కమిషనర్లు చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బకాయిలపై వడ్డీ పడిపోతుందని, ప్రజలు ముందస్తుగా పన్ను చెల్లించి వడ్డీ మాఫీ పొందాలని కోరుతున్నారు.