
పొదుపు మహిళల్లో ఉప్పొంగిన ఆనందం.. ‘ఆసరా’గా నిలుస్తున్న ప్రభుత్వంపై అంతులేని అభిమానం.. ఆర్థికంగా చేయూతనందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వెల్లువెత్తిన కృతజ్ఞతాభావం.. నిత్యం వెన్నంటే ఉంటూ సహకరిస్తున్న మంత్రి రోజాపై అవధులులేని ఆప్యాయతానురాగం.. అనుక్షణం అండదండలందిస్తున్న వైఎస్సార్‌సీపీతో పెనవేసుకున్న అనుబంధం.. అక్కచెల్లమ్మల మోముపై విరబూసిన దరహాసం.. బుధవారం వడమాలపేటలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా మూడోవిడత నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఆడపడుచు వదనంలో ప్రతిబింబించింది. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న జగనన్న వెంటే ఉంటామంటూ మహిళాలోకం నినదించింది.
వడమాలపేట : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. 31లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే మహిళలు మద్దతుగా నిలుస్తారని, జగనన్న వెంటే జనం నడుస్తున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు. బుధవారం వడమాలపేటలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా మూడోవిడత చెక్కుల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను నాలుగువిడతల్లో మాఫీ చేస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఆడపడుచుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తోందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, ప్రజాసంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నామని వివరించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా, అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అందిస్తున్నారన్నారు. విప్లవాత్మకమైన పథకాలతో దేశానికే దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. జనం ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారన్నారు. పేదలకు మేలు జరిగితే చంద్రబాబు ఓర్వలేరని, అందుకే అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎల్లోమీడియా సహకారంతో ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాబలం ఉందని, ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఏం చేయలేరని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ మరచిపోరని, సరైన సమయంలో .. సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కుట్ర రాజకీయాలతో మనుగడ సాగించాలనుకునే టీడీపీ నేతలకు పరాజయం తప్పదని తెలిపారు. ప్రజాసేవకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న జగనన్నకు జనంతోపాటు దేవుడు సైతం అండగా ఉంటాడని వెల్లడించారు. అనంతరం కేక్ కట్ చేసి, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రామసముద్రంలో వాటర్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఆడపడుచుల ఆర్థికాభివృద్ధే
ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన
వైఎస్సార్‌సీపీకే మహిళల మద్దతు
ఆసరా చెక్కుల పంపిణీలో మంత్రి రోజా
పాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి బుధవారం డ్వాక్రా సంఘాల సభ్యులు క్షీరాభిషేకం నిర్వహించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్న జగనన్న రుణం తీర్చుకోలేమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పుష్ప, సర్పంచ్ లిల్లీ, సీసీ చిరంజీవి పాల్గొన్నారు
