గంగవరం : స్థానిక డ్రైవర్స్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. కాలనీకి చెందిన అశోక్‌కు తమిళనాడులోని వేలూరు చెందిన నందిని(29)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి భాగ్యలక్ష్మి(2)అనే కూతురు ఉంది. అత్తామామాలతో కలిసి ఉండలేక నందిని తన భర్తతో కలిసి అద్దె ఇంటికి మారింది. ఈ క్రమంలో అశోక్ తాగుడికి బానిసయ్యాడు. మద్యం అలవాటు మానేయాలని చెప్పినా వినేవాడు కాదు. దీంతో అనేక పర్యాయాలు నందిని అలిగి పుట్టింటికి వెళ్లిపోయేది. తర్వాత భార్యకు నచ్చజెప్పి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. అశోక్ తన కూతురును తీసుకుని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. మనస్థాపం చెందిన నందిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తిరిగి ఇంటికి వెళ్లిన అశోక్ ఈ విషయం గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అశోక్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.