కలర్‌ ప్రిడెక్షన్‌.. మనీ లాండరింగ్‌! | Sakshi
Sakshi News home page

కలర్‌ ప్రిడెక్షన్‌.. మనీ లాండరింగ్‌!

Published Sat, Aug 15 2020 7:43 AM

Hyderabad Police Letter to ED On Colour Prediction Betting Game - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ– కామర్స్‌ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్‌ గేమింగ్‌కు పాల్పడిన కలర్‌ ప్రిడెక్షన్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాయాలని హైదరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఈ దందాలో పెద్దయెత్తున మనీ లాండరింగ్‌ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ వెబ్‌సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్‌ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర  దర్యాప్తు చేయాల్సిందిగా నగర పోలీసులు ఈడీని కోరనున్నారు. చైనాకు చెందిన బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ సౌత్‌ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్‌ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్, నీరజ్‌ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు.

వీరంతా కలిసి ఈ– కామర్స్‌ సంస్థల ముసుగులో గ్రోవింగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్‌ సర్వీసెస్, పాన్‌ యన్‌ టెక్నాలజీస్‌ సర్వీస్, లింక్‌యన్‌ టెక్నాలజీ, డాకీపే, స్పాట్‌పే, డైసీలింగ్‌ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల పేర్లతో ఆర్‌ఓసీలో రిజిస్టర్‌ చేశారు. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో వివిధ ఈ– కామర్స్‌ వెబ్‌సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్‌ ప్రిడెక్షన్‌ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్‌ గేట్‌ వే అయిన పేటీఎం, గూగుల్‌ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చేపట్టారు. బెట్టింగ్‌కు సంబంధించిన తొలుత డాకీ పే సంస్థకు వెళుతోంది.

అక్కడి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హాంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నగదు బీజింగ్‌  టీ పవర్‌ సంస్థ చేరినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఇతర పత్రాలను అందిస్తూ ఈడీకి లేఖ రాస్తున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలతో ఈడీకి అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement