వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్‌ | Zoho CEO Sridhar Vembu Rules Out Expanding Work From Home | Sakshi
Sakshi News home page

వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్‌

May 18 2026 7:39 PM | Updated on May 18 2026 8:10 PM

Zoho CEO Sridhar Vembu Rules Out Expanding Work From Home

భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.

ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలు

కంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్‌మెంట్ టీమ్‌లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్‌ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.

జోహో పునసమీక్ష

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.

ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్‌లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.

ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలు

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్‌ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.

ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

Advertisement
 
Advertisement
Advertisement