సంస్థ మారినా ఆటోమేటిగ్గా ఖాతా బదిలీ.. త్వరలోనే సాకారం
న్యూఢిల్లీ: ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత భవిష్యనిధి (ఈపీఎఫ్)ని మరింత సులభంగా ఉపసంహరించుకునే విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఉపసంహరణ క్లెయిమ్‌లను ఆటోమేట్ చేయనున్నట్టు సెంట్రల్ ప్రావిడెండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి తెలిపారు. అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోని 7 కోట్ల మందికి ప్రయోజనం కలగునుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్‌లు ఆటోమేటిగ్గా ప్రాసెస్ చేస్తుండడం తెలిసిందే. క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత మూడు పనిదినాల్లో ప్రాసెస్ చేయాలన్నది గడువు. ఉద్యోగి సంస్థను మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతా బదిలీ సైతం ఆటోమేటిగ్గా జరిగే విధానాన్ని తీసుకురానున్నట్టు, దీంతో సభ్యులు బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు.
నాలుగో ఏటా లాభాలే: ప్రభుత్వ బ్యాంకులపై ఆర్థిక శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) వరుసగా నాలుగో ఏడాది లాభాలు ఆర్జించినట్లు ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ పేర్కొంది. గతేడాది(2025–26)లో నికర లాభాలు 11 శాతం ఎగసి రూ. 1.98 లక్షల కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఇది పీఎస్‌బీల చరిత్రలోనే అత్యధికంకాగా.. రుణ నాణ్యత మెరుగుపడటం, రుణాల వృద్ధి, అధిక ఆదాయం ఇందుకు తోడ్పడినట్లు తెలియజేసింది.
పీఎస్‌బీల మొత్తం నిర్వహణ లాభం 3.21 లక్షల కోట్లకు చేరగా.. బిజినెస్ 13 శాతం పుంజుకుని రూ. 283.3 లక్షల కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం వీటి డిపాజిట్లు 10.6 శాతం వృద్ధితో రూ. 156.3 లక్షల కోట్లకు చేరాయి. స్థూల అడ్వాన్సులు 16 శాతం జంప్‌చేసి రూ. 127 లక్షల కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.93 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.39 శాతానికి దిగివచ్చాయి.
చదవండి: రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు


