రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఏప్రిల్‌లో 15 శాతం తగ్గినట్లు ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ (సెరా) వెల్లడించింది. మార్చిలో €5.3 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోగా, ఏప్రిల్‌లో €4.5 బిలియన్ల యూరోలకు తగ్గాయి. నయారా ఎనర్జీకి చెందిన వాదినార్ రిఫైనరీలో ఉత్పత్తిని నిర్వహణ పనుల వల్ల నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణమని సెరా తెలిపింది. ఏప్రిల్‌లో రష్యా చమురు విషయంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.
మొత్తం మీద ఏప్రిల్‌లో రష్యా నుంచి హైడ్రోకార్బన్ల కొనుగోలు (ముడి చమురు, గ్యాస్) 5 బిలియన్ యూరోలుగా ఉంది. ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరాలు తగ్గిపోవడం తెలిసిందే. దీంతో ధరలను తగ్గించేందుకు గాను రష్యా చమురు నౌకలపై అమెరికా ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ రంగ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాయి.
రష్యా యూరల్స్ ముడి చమురు ధర ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 112.3 డాలర్లకు చేరింది. ఐరోపా నిర్దేశించిన గరిష్ట ధర 44.1 డాలర్లు కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. భారత్, టర్కీ వంటి దేశాల్లో శుద్ధి చేసిన రష్యా చమురు ఉత్పత్తులు తిరిగి ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకే ఎగుమతి అవుతున్నట్టు సెరా తెలిపింది.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన


