ఆటో రంగంలో పెట్టుబడులా! | Sakshi
Sakshi News home page

ఆటో రంగంలో పెట్టుబడులా!

Published Mon, Aug 22 2022 11:32 AM

Why you should invest in UTI Transportation and Logistics Fund - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌:  థీమ్యాటిక్‌ ఫండ్స్‌ అన్నవి ఫలానా రంగాలకే పెట్టుబడులను పరిమితం చేసేవి. గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్‌ రంగం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చవిచూసింది. తదుపరి వృద్ధికి ఈ రంగం సిద్ధంగా ఉందని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక రిస్క్‌ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు, మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఆటోమొబైల్‌ రంగాన్ని పెట్టుబడులకు పరిశీలించొచ్చు. ఈ విభాగంలో యూటీఐ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు.  

ప్రస్తుత ట్రెండ్‌.. 
నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి పనితీరు చూపించిన వాటిల్లో ఒకటి. 2021 అక్టోబర్‌ తర్వాత నుంచి చూస్తే ఆటోమొబైల్‌ రంగం నుంచి 171 లిస్టెడ్‌ కంపెనీలు ఉంటే, అందులో 50 స్టాక్స్‌ ఇప్పటికే గరిష్టాలకు చేరాయి. దీంతో స్టాక్స్‌ వ్యాల్యూషన్లను కొంత విస్తరించాయని అర్థం చేసుకోవాలి. కానీ, సాధారణంగా ఆటోమొబైల్‌ రంగంలో సైకిల్‌ మొదలైందంటే కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని నిపుణుల అంచనా. కనుక పెట్టుబడులకు ఇంకా మంచి అవకాశాలున్నట్టుగానే భావించాలి. ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాక్టివ్‌ ఫండ్‌ ఇదొక్కటే. ఈ విభాగంలో ప్యాసివ్‌ ఫండ్‌ను కోరుకునే వారు నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను సైతం పరిశీలించొచ్చు.  
రాబడులు.. 
యూటీఐ ట్రాన్స్‌పోర్ట్‌ పథకం ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో అటు నిఫ్టీ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్, నిఫ్టీ టీఆర్‌ఐ500 టీఆర్‌ఐ, నిఫ్టీ ఆటో టీఆర్‌ఐ కంటే మెరుగైన రాబడులు అందించడం గమనించాలి. అంటే చూడ్డానికి సైక్లికల్‌ రంగానికి సంబంధించిన పథకమే అయినా రాబడుల విషయంలో దీర్ఘకాలంలో మెరుగ్గా పనిచేయడాన్ని విస్మరించకూడదు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 29 శాతం రాబడినిచ్చింది. మూడేళ్లలో వార్షిక రాబడి రేటు 24 శాతంగా ఉంది. ఐదేళ్లలో ఏటా 18 శాతానికి పైనే రాబడినిచ్చింది. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా, 16 శాతం వార్షిక రాబడినిచ్చింది.  
పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1,886 కోట్ల పెట్టుబడులున్నాయి. 96.42 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. మిగిలిన పెట్టుబడులను నగదు, ఇతర రూపాల్లో కలిగి ఉంది. పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు 73 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. మిడ్‌క్యాప్‌ విభాగానికి 20 శాతం, స్మాల్‌క్యాప్‌ విభాగానికి 7 శాతం వరకు కేటాయించింది. పెట్టుబడుల ప్రాధాన్యాన్ని గమనించినట్టయితే నూరు శాతం తీసుకెళ్లి ఆటోమొబైల్‌ స్టాక్స్‌లో పెట్టలేదు. ఈ రంగానికి 80 శాతాన్ని కేటాయించింది. సేవల రంగ కంపెనీలకు 12.34 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌కు 2.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement