రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాసివ్ ఇన్‌కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.
పూర్తిగా యాక్టివ్ వర్క్
ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు.
కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!
చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్‌కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.
పాసివ్ ఇన్‌కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలు
మొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.
రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి.
మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.
మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్‌కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.
చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.
ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!


