బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.
డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.
దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.
పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.
బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.
ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.
ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!


