చిన్న సంస్థల్లో ‘పశ్చిమాసియా’ సంక్షోభం  | West Asia crisis presents severe challenges for Small and Medium-sized Enterprises | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థల్లో ‘పశ్చిమాసియా’ సంక్షోభం 

May 29 2026 4:12 AM | Updated on May 29 2026 4:12 AM

West Asia crisis presents severe challenges for Small and Medium-sized Enterprises

రాష్ట్ర ప్రభుత్వాలూ అండగా నిలవాలి 

అసోచాం సెక్రటరీ జనరల్‌ సౌరభ్‌ సన్యాల్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశీయంగా దాదాపు 61 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్‌ సౌరభ్‌ సన్యాల్‌ తెలిపారు.  సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, వ్యాపారాలు మందగించడంతో పలు సంస్థలు తీసుకున్న రుణాలు ఎన్‌పీఏలుగా మారే ముప్పు నెలకొందని ఆయన చెప్పారు. 

ఈ నేపథ్యంలో పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.55 లక్షల కోట్లతో ఈసీఎల్‌జీఎస్‌ (ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారంటీ స్కీమ్‌) తరహాలో రాష్ట్రాలు ప్రత్యేక స్కీమ్‌లాంటిదేదైనా ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నారు. అలాగే సంక్లిష్టమైన నిబంధనల అమలుకు సంబంధించి కొంత వెసులుబాట్లు కల్పించాలని గురువారమిక్కడ  డేటా సెంటర్స్, ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.  

చిన్న సంస్థలకు ఉపశమనం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌కి కూడా అసోచాం పలు ప్రతిపాదనలు చేసినట్లు సన్యాల్‌ చెప్పారు. ఆరు నెలల పాటు రుణాలపై మారటోరియం విధించడం, గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో విదేశీ మారకంలో ప్రీ–షిప్‌మెంట్‌ రుణాలు కల్పించడం, వాటి కాల వ్యవధిని 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచడంలాంటి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. 

అలాగే తదుపరి రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకులు అవసరమైనప్పుడు తీసుకునేలా రెపో రేటుకే రూ. 1 లక్ష కోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సన్యాల్‌ తెలిపారు.  

మరో మూడు నుంచి ఆరు నెలల వరకు ఎకానమీ సాధారణంగానే ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ తర్వాత సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉన్నా, వృద్ధి రేటు 7 శాతం లోపునకు తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు సన్యాల్‌ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తకపోయి ఉంటే ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీ సంస్థలకు గణనీయంగా ప్రయోజనాలు లభించేవని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement