వేదాంతా లాభం హైజంప్‌  | Vedanta Net profit rises to Rs 6,698 cr In Q4 results | Sakshi
Sakshi News home page

వేదాంతా లాభం హైజంప్‌ 

Apr 30 2026 4:25 AM | Updated on Apr 30 2026 4:25 AM

Vedanta Net profit rises to Rs 6,698 cr In Q4 results

క్యూ4లో రూ. 9,352 కోట్లు 

మే 1 నుంచి బిజినెస్‌ల విడదీత

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలి తాలుసాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 89 శాతం దూసుకెళ్లి రూ. 9,352 కోట్లను తాకింది. అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు బలపడటం, అమ్మకాల పరిమాణంలో వృద్ధి, రూపాయి మారకపు విలువ క్షీణత ఇందుకు దోహదపడ్డాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,961 కోట్లు ఆర్జించింది. 

క్యూ4లో మొత్తం ఆదాయం సైతం 29 శాతం జంప్‌చేసి రూ. 51,524 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,789 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 13,702 కోట్ల నుంచి రూ. 19,119 కోట్లకు పెరిగాయి.  విడదీయనున్న కంపెనీల లిస్టింగ్‌కు వీలుగా వచ్చే వారం స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు దరఖాస్తు చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో జూన్‌మధ్యకల్లా ఆయా బిజినెస్‌లు ప్రత్యేక కంపెనీలుగా లిస్టయ్యే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.  

రూ. 14,918 కోట్ల పెట్టుబడులు 
కొత్త సామర్థ్యాల వినియోగం, పటిష్ట నిర్వహణా సామర్థ్యాలను ప్రతిఫలిస్తూ 2.9 మిలియన్‌ టన్నుల(ఎంటీ) అల్యూమినా, 2.46 ఎంటీ అల్యూమినియం, 1.1 ఎంటీ మైన్‌డ్‌ మెటల్‌ను డెలివరీ చేసినట్లు వేదాంతా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ మిశ్రా పేర్కొన్నారు. గతేడాది వృద్ధికి వీలుగా రూ. 14,918 కోట్ల పెట్టుబడులను వెచ్చించినట్లు వెల్లడించారు. 2026 మార్చి31కల్లా కంపెనీ స్థూల రుణ భారం రూ. 81,470 కోట్లుగా నమోదైంది. 

నికర రుణ భారం రూ. 53,254 కోట్లుకాగా.. క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నిర్వహణ లాభం, నికర లాభాలను సాధించినట్లు వేదాంతా సీఎఫ్‌వో అజయ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. వేదాంతా లిమిటెడ్‌ నుంచి అల్యూమినియం(వీఏఎంఎల్‌), మర్చంట్‌ పవర్‌(టీఎస్‌పీఎల్‌), ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(ఎంఈఎల్‌), ఇనుప ఖనిజ(వీఐఎస్‌ఎల్‌) బిజినెస్‌లను నాలుగు లిస్టెడ్‌ కంపెనీలుగా విడదీస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు మే 1 రికార్డ్‌ డేట్‌గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.  

ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్‌ఈలో 4.7 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement