breaking news
metal price
-
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలి తాలుసాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 89 శాతం దూసుకెళ్లి రూ. 9,352 కోట్లను తాకింది. అంతర్జాతీయంగా మెటల్ ధరలు బలపడటం, అమ్మకాల పరిమాణంలో వృద్ధి, రూపాయి మారకపు విలువ క్షీణత ఇందుకు దోహదపడ్డాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,961 కోట్లు ఆర్జించింది. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం 29 శాతం జంప్‌చేసి రూ. 51,524 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,789 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 13,702 కోట్ల నుంచి రూ. 19,119 కోట్లకు పెరిగాయి. విడదీయనున్న కంపెనీల లిస్టింగ్‌కు వీలుగా వచ్చే వారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు దరఖాస్తు చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో జూన్మధ్యకల్లా ఆయా బిజినెస్‌లు ప్రత్యేక కంపెనీలుగా లిస్టయ్యే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది. రూ. 14,918 కోట్ల పెట్టుబడులు కొత్త సామర్థ్యాల వినియోగం, పటిష్ట నిర్వహణా సామర్థ్యాలను ప్రతిఫలిస్తూ 2.9 మిలియన్ టన్నుల(ఎంటీ) అల్యూమినా, 2.46 ఎంటీ అల్యూమినియం, 1.1 ఎంటీ మైన్డ్ మెటల్‌ను డెలివరీ చేసినట్లు వేదాంతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. గతేడాది వృద్ధికి వీలుగా రూ. 14,918 కోట్ల పెట్టుబడులను వెచ్చించినట్లు వెల్లడించారు. 2026 మార్చి31కల్లా కంపెనీ స్థూల రుణ భారం రూ. 81,470 కోట్లుగా నమోదైంది. నికర రుణ భారం రూ. 53,254 కోట్లుకాగా.. క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నిర్వహణ లాభం, నికర లాభాలను సాధించినట్లు వేదాంతా సీఎఫ్‌వో అజయ్ గోయెల్ పేర్కొన్నారు. వేదాంతా లిమిటెడ్ నుంచి అల్యూమినియం(వీఏఎంఎల్), మర్చంట్ పవర్(టీఎస్పీఎల్), ఆయిల్ అండ్ గ్యాస్(ఎంఈఎల్), ఇనుప ఖనిజ(వీఐఎస్ఎల్) బిజినెస్‌లను నాలుగు లిస్టెడ్ కంపెనీలుగా విడదీస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు మే 1 రికార్డ్ డేట్‌గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 4.7 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది. -
భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్‌లో బంగారం మార్కెట్‌పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు. ► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్‌కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం. ► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి. ► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్‌లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది. ► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్‌లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్‌ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. సానుకూల మార్పులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ -
మార్కెట్ల జోరు- మెటల్ స్టాక్స్ హవా
ఒక్క రోజు వెనకడుగు తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 36,533కు చేరగా.. నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుని 10,761ను తాకింది.విదేశీ మార్కెట్లో బేస్ మెటల్స్ ధరలు పెరుగుతున్న నేపథ్యలో తాజాగా మెటల్ రంగం జోరందుకుంది. దీంతో ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 2.5 శాతం ఎగసింది. మెటల్ కౌంటర్లలో హిందాల్కో, సెయిల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్, నాల్కో, వేదాంతా 4.3-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర కౌంటర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్ఎండీసీ, వెల్స్పన్ కార్ప్, హిందుస్తాన్ కాపర్, హిందుస్తాన్ జింక్ 2-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి. కారణమేవిటంటే? కోవిడ్-19 విస్తరిస్తున్న కారణంగా వివిధ లోహాల ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటం ప్రధానంగా బేస్ మెటల్ ధరలకు రెక్కలనిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. లండన్ మెటల్ ఎక్స్ఛేంజీ(ఎల్ఎంఈ)లో కాపర్ ధరలు మార్చి కనిష్టం నుంచి తాజాగా 40 శాతం ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చిలీలో కాపర్ మైనింగ్‌కు బ్రేక్‌పడగా.. చైనా నుంచి డిమాండ్ పెరగడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. మార్చిలో కాపర్ ధరలు 45 నెలల కనిష్టాలకు చేరిన విషయం విదితమే. ఈ బాటలో జింక్, అల్యూమినియం ధరలు సైతం ఎల్‌ఎంఈలో ఫిబ్రవరి తదుపరి గరిష్టాలకు చేరాయి. జింక్ టన్ను ధర ప్రస్తుతం 2131 డాలర్లను అధిగమించింది. -
మరింత దిగివస్తున్న బంగారం ధరలు
ముంబయి : పసిడి ప్రియులకు శుభవార్త. పండుగల వేళ బంగారం ధరలు మరింతగా దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు 15 నెలల కనిష్టానికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 1200 డాలర్లకు సమీపంలో వచ్చింది. ప్రస్తుతం 1214 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 2 వేల రూపాయల దాకా తగ్గి... 26,360కి సమీపంలో ట్రేడవుతోంది. కిలో వెండి ధర 550 రూపాయలకు పైగా కోల్పోయి 39 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు మెటల్ ధరలు కూడా ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.


