యూఎస్‌ మార్కెట్లకు ప్యాకేజీ దెబ్బ | Sakshi
Sakshi News home page

యూఎస్‌ మార్కెట్లకు ప్యాకేజీ దెబ్బ

Published Tue, Oct 20 2020 10:12 AM

US Market plunges due to selloff in FAAMNG stocks - Sakshi

కోవిడ్‌-19 ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్‌ 411 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 28,195 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 57 పాయింట్ల(1.6 శాతం) నష్టంతో 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 193 పాయింట్లు(1.7 శాతం) కోల్పోయి 11,665 వద్ద స్థిరపడింది. ఆర్థిక మంత్రి స్టీవ్‌ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలపై మంగళవారంలోగా స్పష్టత వచ్చే వీలున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలలోగా ప్యాకేజీ అమలుకు వీలు కలగనున్నట్లు తెలియజేశారు. దీంతో నేడు మార్కెట్లు కోలుకునే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధ్యక్ష ఎన్నికలలో భాగంగా గురువారం ప్రెసిడెంట్‌ ట్రంప్‌, ప్రత్యర్థి జో బిడెన్‌ మధ్య చివరి దశ డిబేట్‌ జరగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

4 లక్షలు
గత వారం కోవిడ్‌-19 కేసులు 13 శాతం పెరిగి 3.93 లక్షలుగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.అయితే మార్చి తదుపరి ఈ ఆదివారం తొలిసారి 10 లక్షల మందికిపైగా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్‌ చేసినట్లు భద్రతాధికారులు వెల్లడించడం గమనార్హం! ఈ నేపథ్యంలోనూ ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో రవాణా సంబంధ కౌంటర్లు డీలాపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఫాంగ్‌ స్టాక్స్‌ బోర్లా
కొద్ది నెలలుగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌లో సోమవారం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో యాపిల్‌, అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ 2.6-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్‌ 2 శాతం నీరసించింది. కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్‌ 4 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా 1.2 శాతం, ఫైజర్‌ ఇంక్‌ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కొనాకోఫిలిప్స్‌ 3.2 శాతం, షెవ్రాన్‌ కార్పొరేషన్‌ 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. 

Advertisement
Advertisement