యుద్ధ విరమణతో భారత్‌కు దక్కేదేమిటి? | US-Iran Ceasefire What It Means for India Energy Security and Inflation | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇరాన్‌ యుద్ధ విరమణతో భారత్‌కు దక్కేదేమిటి?

Apr 9 2026 10:42 AM | Updated on Apr 9 2026 10:50 AM

US-Iran Ceasefire What It Means for India Energy Security and Inflation

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. గత నెల రోజులుగా సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని చల్లారుస్తూ అమెరికా, ఇరాన్‌ దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం అర్థరాత్రి దాటాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో వెలువడిన ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

ఏమిటీ ఒప్పందం? ప్రధానాంశాలు ఇవే..

అమెరికా, ఇరాన్‌లు రెండు వారాలపాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదు. క్షిపణి ప్రయోగాలు, ప్రతీకార దాడులు తక్షణమే నిలిపివేయాలి. యుద్ధం కారణంగా నిలిచిపోయిన రవాణా నౌకలను హార్మూజ్‌ జలసంధి గుండా అనుమతించేందుకు ఇరాన్ తాత్కాలికంగా అంగీకరించింది. అయితే, ఇరాన్ సైనిక పర్యవేక్షణలోనే ఈ నౌకలు ప్రయాణించాలి. తదుపరి దౌత్యపరమైన చర్చల కోసం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు దేశాల ప్రతినిధులను ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌కు ఆహ్వానించారు.

ఎవరి వాదన వారిదే!

ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు తమ విజయంగానే అభివర్ణించుకుంటున్నాయి. ‘మా సైనిక లక్ష్యాలు నెరవేరాయి. ఇది పూర్తి విజయం. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిందే. భూగర్భంలో ఉన్న అణు వ్యర్థాలను తొలగించేందుకు ఇరాన్‌తో కలిసి పని చేస్తాం’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ తన 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో ఇరాన్‌పై ఆంక్షల తొలగింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇవి నెరవేరితేనే శాంతి సుస్థిరమవుతుందని ఇరాన్ అంటోంది.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

పశ్చిమాసియాలోని ఈ పరిణామం భారత్‌కు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మన దేశ ఇంధన భద్రత హార్మూజ్‌ జలసంధిపైనే ఆధారపడి ఉంది. భారత్ దిగుమతి చేసుకునే వంటగ్యాస్‌లో 90% ఈ జలసంధి గుండానే వస్తుంది. గత నెల రోజులుగా సరఫరా ఆగిపోవడంతో దేశీయంగా ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడింది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 30%, సహజ వాయువులో 47% ఈ మార్గం ద్వారానే వస్తాయి. యుద్ధం విరమణ ప్రకటన రాగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 15% పడిపోయి 90 డాలర్ల స్థాయికి చేరింది. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది.

ఇజ్రాయెల్ - లెబనాన్ పరిస్థితి ఏమిటి?

ఈ కాల్పుల విరమణ ఇరాన్‌తో యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇది చర్చల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి హార్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన 16 భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement
 
Advertisement
Advertisement